టీటీడీ కీలక నిర్ణయం.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ నెల 13, 14, 15వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతిలో ఈ నెల 14న దక్షిణాది రాష్ట్రాల సీఎంల భేటీ దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే మూడ్రోజుల పాటు దర్శన టిక్కెట్లను టీటీడీ జారీ చేయనుంది. ఈ నెల 14న తిరుపతిలో 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ కార్యక్రమం (దక్షిణాది రాష్ట్రాల సదస్సు) జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ లెప్టెనెంట్ గవర్నర్లు పాల్గొంటారు.













