జూట్ బ్యాగ్ లో శ్రీవారి లడ్డూల పంపిణీ
తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకున్న తరువాత శ్రీవారి లడ్డులను ఎంతోమంది భక్తులు కొనుగోలు చేస్తుంటారు. ఈ లడ్డు ప్రసాదాలను తీసుకెళ్ళడానికి ప్లాస్టిక్ కవర్లను విచ్చలవిడిగా కొనుక్కుంటున్నారు. దీనివల్ల పర్యావరణానికి హాని కలుగుతున్నదన్న ఉద్దేశ్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా లడ్డు ప్రసాదాన్ని ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జూట్ బ్యాగ్లో తీసుకెళ్ళేలా చక్కని జూట్బ్యాగులను అందుబాటులోకి తెచ్చింది.
తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి చేపట్టిన చర్యల్లో భాగంగానే ఇది అమలులోకి వచ్చింది. టీటీడీ కోరిక మేరకు సెంట్రల్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లాభనష్టాలు చూడకుండా తయారీ ధరకే జనపనార సంచులను విక్రయించడానికి అంగీకరించింది. దీంతో గత సోమవారం నుంచి వీటి విక్రయాలు లాంఛనంగా మొదలుపెట్టారు.













