శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు విడుదల చేసిన టీటీడీ చైర్మన్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి విడుదల చేశారు. శ్రీవారి ఆలయం వద్ద పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది అధికమాసం కావడంతో స్వామివారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. అక్టోబర్ 14 నుంచి 22వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వివరించారు. సెప్టెంబరు 18వ తేదీన జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడిరచారు. బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేస్తామని, సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా దర్శన విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎవ్వరికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.













