కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ
వచ్చే ఏడాదిలో భక్తుల సౌలభ్యం కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై చర్చించేందుకు సమావేశమైన టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత దర్శన టికెట్లను పెంచాలని నిర్ణయం తీసుకుందన్నారు. గత ఏడాది మాదిరిగానే 10 రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించాలని తీర్మానించినట్లు తెలిపారు. అన్నమయ్య మార్గంలో మూడో ఘాట్‌రోడ్, నడక మార్గం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి రోడ్డు, కాలినడక మార్గాలను నిర్మిస్తామన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు వల్ల దెబ్బతిన్న ఆలయాను పునరుద్ధరణ చేసేందుకు పాలకమండలి ఆమోదం తెలిపిందన్నారు. శ్రీశైలంలో ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయిస్తామని వెల్లడించారు.
సంక్రాంతి నుంచి దర్శనాల సంఖ్య పెంచుతామని, దర్శనాల సంఖ్య పెంపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. పీడియాట్రిక్ ఆసుపత్రిలో విజయవంతంగా హార్ట్ సర్జరీలు జరుగుతున్నాయి. నెల రోజుల్లో 11 మంది పిల్లల ప్రాణాలు కాపాడాం, ఆస్పత్రి పూర్తి స్థాయిలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కల్యాణకట్ట క్షురకులకు పీస్ రేట్ రూ.11 నుంచి 15కు పెంచాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎఫ్ఎంఎస్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేశామన్నారు. కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. సీఎం హామీ మేరకు టీటీడీలో పనిచేసే కార్మికులకు ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్లో కలిపాం. కాంట్రాక్టర్ కింద పని చేసే కార్మికులకు ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్లో కలపలేమన్నారు. ఇప్పటి వరకు టీటీడీ ప్రత్యేకమైన ఐటీ వింగ్ లేదు. టీటీడీ ఐటీ వింగ్ కోసం అర్హత కలిగిన ఉద్యోగులతో ప్రత్యేక ఐటీ వింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.













