నంద్యాలలో సీఎం చంద్రబాబుకు గుడి
వాళ్లంటే అందరికీ హేళనే. వూరికే వారి మీద చిరాకు పడుతుంటారు. అందరిలాగే పుట్టిన మనుషులే అయినా చిన్నచూపు చూస్తుంటారు. విధి ఆడిన ఆటలో ఓడిపోయిన వారంతా బతుకు పోరాటంలో భిక్షాటననే మార్గంగా ఎంచుకున్నారు. అలాంటి వారి ఆత్మాభిమానాన్ని నిలబెడుతూ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వారు దేవుడిలా చూస్తున్నారు. అంతేకాదు ఆయనకు గుడి నిర్మించాలనుకుంటున్నారు.
సమాజంలో మూడో వర్గానికి సంక్షేమ పథకాలు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హిజ్రాల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది. వారికి రేషన్ కార్డు, ఇళ్లు, ప్రతి నెల రూ.1500 పింఛను, చదువుకున్న హిజ్రాలు వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకు రుణాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఈ ప్రభుత్వం తమను మనుషులుగా గుర్తించిందని, అందుకే ఆయనకు గుడిని నిర్మించాలనుకుంటున్నామని తెలిపారు. నంద్యాల నుంచి మహానంది వెళ్లే దారిలో గుడి నిర్మించడానికి ఇప్పటికే స్థలం సేకరించినట్లు హిజ్రాల సంక్షేమ సంఘం నాయకుడు విజయ్‌కుమార్ తెలిపారు. ఆలయంలో వెండి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అందుకోసం ఇప్పటికే చాలా మంది దాతలు ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.













