విశాఖలో గ్యాస్ లీక్…8 మంది మృతి…వందలమందికి అస్వస్థత
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకేజీతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, వందల మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిశ్రమ నుంచి స్టెరీన్ అనే గ్యాస్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ వెంటకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఈరోజు తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర రసాయన వాయువు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రసాయనంతో దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో స్థానికులు అనారోగ్యానికి గురయ్యారు. కొందరు అపస్మాకరకస్థితిలో రోడ్డుపై పడిపోయారు. వెంటనే ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అనారోగ్యానికి గురైన వారిని అంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ గ్యాస్ వల్ల తొలుతగా తలనొప్పి, వినికిడి సమస్య, నీరసం, కళ్ళు మంటలు వస్తాయి. ఇదే గ్యాస్‌ను ఎక్కువగా పీలిస్తే క్యాన్సర్, కిడ్నీ వంటి వ్యాధులతో బాధపడే అవకాశం ఉందని చెబుతున్నారు.













