విశాఖలో ఘనంగా పర్యాటక దసరావళి సంబరాలు
ప్రపంచ పర్యాటక దినోత్సవంతో పాటు, దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం ఆర్కే బీచ్ వేదికగా ఈ నెల 27 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకూ పర్యాటక దసరావళి సంబరాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఈ సందర్భంగా పర్యాటక దసరావళి సంబరాల గోడపత్రికను విడుదల చేశారు. అనంతరం చినరాజప్ప మాట్లాడుతూ ప్రకృతి అందాతో అలరారే విశాఖ పర్యాటక ప్రదేశాలను దేశ, విదేశీ పర్యాటకులకు పరిచయం చేసేలా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు హ్యాపీ స్ట్రీట్ కార్యక్రమాలు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 6 రోజుల పాటు నిర్వహించే సంబరాల్లో ప్రజలను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ నెల 30న జరిగే కార్యక్రమానికి సినీ హీరో మహేష్‌బాబు రానున్నారని, మిగతా రోజుల్లో జరిగే కార్యక్రమాలకు నారా రోహిత్, రవితేజలు విచ్చేస్తారన్నారు.













