మొన్న కోస్తాను కుదేలు చేసి.. ఇప్పుడు ఉత్తరాంధ్రను వణికిస్తున్న వరుణుడు..
వాయుగుండ ప్రభావం కారణంగా గత రెండు రోజులుగా ఉత్తర ఆంధ్రాలో కురుస్తున్న వానలు ప్రజలను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇంకా విజయవాడ వాన ధాటి నుంచి.. వరద బీభత్సం నుండి ఊపిరి పీల్చుకోలేదు. పది రోజులగా వరుణుడి ఆగ్రహంతో విజయవాడ పై వరద విరుచుకు పడింది. ప్రభుత్వం భారీగా బాధితులను ఆదుకోవడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నప్పటికీ ఇంకా విజయవాడలో పరిస్థితులు పూర్తిగా కుదుటపడలేదు.
ఇంతలోనే మరొకసారి వరుణుడు ఉత్తరాంధ్ర పై తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. గడిచిన రెండు రోజులలో వాయుగుండం ప్రభావంతో భారీ వానలతో ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి అవుతోంది. శనివారం రాత్రి నుంచి విరామం లేకుండా కురుస్తున్న వాన కారణంగా విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి లో 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ వాన ప్రభావం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని రేగిడి, కొత్తవలస, బొబ్బిలి, విజయనగరం, గొర్ల మండలాలపై తీవ్రంగా ఉంది.
ఈ ప్రాంతాలలో ఇల్లు ముంపు బారిన పడ్డాయి. అంతేకాదు శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు రాకపోకలలో కూడా అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ వానల కారణంగా లావేరు మండలంలోని బెజ్జిపురం నుండి ఉడత వలసకు వెళ్లే మార్గంలో సెట్టిగెడ్డ వద్ద ఓ వ్యాన్ కొట్టుకుపోయింది. అతి కష్టం మీద డ్రైవర్ని మాత్రం కాపాడగలిగారు. విశాఖపట్నంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన వల్ల గోపాల పట్టణంలోని కొండ చర్యలు విరిగిపడ్డాయి. జీవీఎంసీ పరిధిలోని 91వ వార్డు రామకృష్ణ నగర వద్ద రక్షణ గోడ ఆదివారం మధ్యాహ్నం వానకు బాగా నాని కుప్పకూలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు యుద్ధ ప్రాతిపదికన అక్కడ సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. ఇంకా కోస్తా కష్టం నుంచే కోలుకోక ముందే కూటమి ప్రభుత్వం ముందు ఉత్తరాంధ్ర మరొక సవాలుగా మారుతుంది. విజయవాడలో జరిగిన ప్రమాద తీవ్రత ఉత్తరాంధ్రలో రిపీట్ కాకూడదు అనే ఉద్దేశంతో ముందస్తు చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం పూనుకుంటుంది.













