పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం… రూ.30 లక్షల బహుమతి
టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించిన ఆంధప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పీవీ సింధుకు రూ.30 లక్షలను నగదు బహుమతిగా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అలాగే అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో ప్రతిభ చూపిన రాష్ట్ర క్రీడా విధానం ప్రకారం నగదు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2017-22 క్రీడా విధానం ప్రకారం ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.75 లక్షలు, రజత విజేతకు రూ.50 లక్షలు, కాంస్య పతకం దక్కించుకున్న వారికి రూ.30 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు.













