సిరా చుక్క ఎడమ చేతి చూపుడు వేలుకు కాదు.. కుడి చేతి చూపుడు వేలుకు
తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్ల వేలికి సిరా వేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైన ఆదేశాల్ని జారీ చేసింది. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకున్న వారికి వారి కుడిచేతి చూపుడు వేలికి సిరా వేయాలని పేర్కొంది. మామూలుగా ఓటు వేసిన వారి ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా వేస్తారు. కానీ ఏపీలో కొన్ని రోజుల క్రిందటే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ సమయంలో ఓటర్ల ఎడమ చేతికి సిరా వేశారు. ఇప్పటికీ కొందరికి అలాగే ఉంది. అదే సిరాతో గనక పోలింగ్ కేంద్రంలోకి వెళితే అధికారులు తిరస్కరించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే కుడిచేతి చూపుడు వేలికి సిరా చుక్క వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేసింది.













