తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ ఇక లేరు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి లోక్సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావు (63) చెన్నైలో కన్నుమూసారు. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణైంది. దీంతో చికిత్స కోసం మూడు వారాల క్రితం చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స తర్వాత కరోనా నెగిటివ్ నిర్ధారణ అయిందని, అయితే రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా సెఫ్టిసీమియా అనే వ్యాధి బారినపడ్డారని అపోలో ఆస్పత్రి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, బర్డ్ (తిరుపతి) డైరెక్టర్ డాక్టర్ మదన్మోహన్ రెడ్డి తెలిపారు. ఐసీయూలో ఉంచి చికిత్స చేశారని, ఈ సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారని చెప్పారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని భీమవరంలో 1956 జూన్ 15న బల్లి పెంచలయ్య, రామ లక్ష్మి దంపతులకు దుర్గాప్రసాదరావు జన్మించారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కావడంతో వెంకటగిరిలో స్థిరపడ్డారు. నెల్లూరు వీఆర్ కళాశాలలో బీఏ బీఎల్ చదువుకున్న దుర్గాప్రసాద్రావు న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. దుర్గాప్రసాదరావుకు భార్య సరళ, కుమారులు కళ్యాణ్, కార్తీక్, కుమార్తె హరిత ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో తొలిసారిగా గూడూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్మేగా పోటీ చేసి గెలిచారు. గూడూరు నుంచే మొత్తం నాలుగు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఓ పర్యాయం మంత్రిగా పనిచేశారు. 2019లో వైఎస్సార్సీపీలో చేరి 2,28,375 ఓట్ల భారీ మెజార్టీతో తిరుపతి ఎంపీగా గెలుపొందారు.













