తిరుమలేశుడి ‘సేవ’కు పరీక్ష తప్పనిసరి!
కరోనా వచ్చినప్పటి నుంచి తిరుమలలో ఆర్జిత సేవలు నిలిచిపోయాయి. ఎప్పుడెప్పుడు స్వామి వారి సేవలో పాల్గొనాలా.. ఎప్పుడెప్పుడు ఆయన సేవలో తరించాలా.. అని కోట్లాది మంది భక్తులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటివారికి టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 14 నుంచి తిరుమలలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించనున్నట్టు ప్రకటించింది. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు పెట్టింది.
వచ్చే నెల 14 నుంచి ప్రారంభం కాబోయే ఆర్జిత సేవల్లో పాల్గొనబోయే వాళ్లు తప్పనిసరిగా కోవిడ్ పరీక్ష చేయించుకుని వెళ్లాలి. సేవకు వెళ్లే మూడు రోజుల ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకుని.. నెగెటివ్ సర్టిఫికేట్ చూపిస్తేన్ సేవకు అనుమతించనుంది. కరోనా వల్ల గత ఏడాది మార్చి 17 నుంచి ఆర్జిత సేవలు నిలిపివేసింది టీటీడీత. మార్చి 20వ తేదీ నుంచి దర్శనాలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేసింది. అయితే స్వామి వారి నిత్య కైంకర్యాలను మాత్రం ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత జూన్ 8వ తేదీ నుంచి దర్శనాలు పునఃప్రారంభించింది. అయితే పరిమితంగానే భక్తులను అనుమతిస్తూ వచ్చింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో దర్శనాలు కొనసాగుతున్నాయి. అయితే ఆర్జిత సేవలకు మాత్రం భక్తులను అనుమతించలేదు. ఆర్జిత సేవలను పునఃప్రారంభించాలంటూ పెద్దఎత్తున ఒత్తిడి రావడంతో వచ్చే నెల నుంచి ప్రారంభించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.
భక్తుల డిమాండ్ మేరకు ఏకాంత సేవలను వర్చువల్ పద్ధతిలో భక్తులకు అందిస్తోంది టీటీడీ. గత ఏడాది నవంబర్లో సహస్ర దీపాలంకరణ సేవ, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. వీటిలో పాల్గొనే భక్తులకు
స్వామి వారి దర్శన భాగ్యం కూడా కల్పించింది. అయితే.. నేరుగా ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలంటూ చాలా నెలలుగా డిమాండ్ మొదలైంది. దీంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
శ్రీవారి ఆర్జిత సేవలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. సేవల టికెట్లు రిలీజ్ చేసిన నిమిషాల్లోనే టికెట్లు అయిపోతుంటాయి. నెలల తరబడి టికెట్ల కోసం వెయిట్ చేస్తుంటారు భక్తులు. ఇన్నాళ్లూ స్వామివారి సేవలో పాల్గొనకపోయామే.. అనే అసంతృప్తి అందరిలోనూ ఉంది. గతంలో మూడు నెలల ముందు నుంచే ఆర్జిత సేవలను అందుబాటులో ఉంచేది టీటీడీ. ప్రస్తుత సేవలకు సంబంధించి త్వరలోనే టికెట్లు రిలీజ్ చేయనుంది.













