జూలై 27న శ్రీవారి ఆలయం మూసివేత
చంద్రగ్రహణం కారణంగా జులై 27వ తేదీ సాయంత్రం 5:00 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 4:15 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం మూసివేయనున్నారు. ఈ సందర్భంగా పండితులు మీడియాతో మాట్లాడుతూ జులై 27వ తేదీ శుక్రవారం రాత్రి 11:54 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై జూలై 28న శనివారం ఉదయం 3:49 గంటలకు పూర్తవుతుందన్నారు. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ అని తెలిపారు. జూలై 28న ఉదయం 4:15 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తామన్నారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నామని తెలిపారు. తిరిగి ఉదయం 7:00 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు.













