7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 నుంచి 15 వరకు జరుగుతాయని టీటీడీ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలలో సీఎం వైఎస్ జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అలిపిరి వద్ద నూతనంగా నిర్మించిన గోమందిరంను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. పాత బర్డ్ హాస్పిటల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ కన్నడ, హిందీ భాషలలో ప్రారంభించనున్నారు. తిరుమలలో స్వామివారి తయారీకి నూతనంగా నిర్మించిన బూందీ పోటు నిర్మాణాన్ని కూడా ప్రారంభించనున్నారు. కోవిడ్ కారణంగా ఈసారి కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే జరుగుతాయని అధికారులు వెల్లడించారు.













