శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీకారం చుట్టింది. ఆదివారం రాత్రి అంకురార్పణతో ఉత్సవాలను ఆరంభించింది. ఇందులో భాగంగా శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రంగ నాయకుల మండపంలో ఆస్థానం నిర్వహించారు. సోమవారం సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రతువుతో బ్రహ్మోత్సవాలు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో అర్చకస్వాములు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది.













