శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
అఖిలాండ కోటి బాహ్మాండ నాయకునికి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరగనున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంపంగి ప్రాకారంలో వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరిగింది. విష్వక్సేనుల వారు విశేష ఆభరణాలంకృతులై ఊరేగింపుగా మంగళవాయిద్యాలతో ఆలయంలోని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేసి, ఆస్థానం నిర్వహించారు. అటు తర్వాత బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో భీజావాహం చేసి అంకురార్పణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీయంగార్లు, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఇఓ కె.ఎస్. జవహార్ రెడ్డి దంపతులు, అదనపు ఈఓ ఏవి. ధర్మారెడ్డి దంపతులు, సివిఎస్ఓ గోపినాథ్‌జెట్టి, ఆలయ డిప్యూటీ ఇఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు, అర్చకులు బోర్డు సభ్యులు, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













