వైకుంఠ ఏకాదశికి విస్తృతంగా ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే సామాన్య భక్తులకు 48 గంటల్లో 40 గంటలు సమయం కేటాయిస్తున్నామని తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. ఈనెల 29, 30 తేదీలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాన శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు చేపట్టే ఏర్పాట్లను జేఈఓ శ్రీనివాసరాజు, ఎస్పీ అభిషేక్ మహంతిలతో పాటు టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా జేఈఓ శ్రీనివాసరాజు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజున కూడా భక్తులు లక్షల సంఖ్యలో తిరుమలకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజున శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వారం (ఉత్తరద్వారం) తెరచి ఉంచడం ప్రత్యేకత అని అన్నారు. ఈద్వారంలో ప్రవేశించిన భక్తులు స్వామిని దర్శించుకోవడం ఎంతో పుణ్యంగా భావిస్తారన్నారు. ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజున 1.72లక్షల మందికి స్వామివారి దర్శనభాగ్యం కల్పించే సౌలభ్యం ఉందన్నారు.













