హింసపై సమగ్ర విచారణ.. అవసరమైతే బదిలీలు తప్పవు..ముఖేశ్ కుమార్ మీనా..
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈనెల 16 నుంచి ఎన్నికల కోడ్ ఆంధ్రాలో అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కోడ్ వచ్చిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. అయితే ఆళ్లగడ్డ ,గిద్దలూరులో మాత్రం పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ రెండు ప్రాంతాలలో రెండు హత్యలు జరిగాయి. అయితే ఇది కేవలం హత్యలు కాదు రాజకీయ హత్యలు అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. మాచర్లలో ఓ పార్టీకి చెందిన కారును తగలబెట్టడం మరింత వివాదాస్పదంగా మారింది. జరుగుతున్న ఈ పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. హింసను ఆపడంలో ఎందుకు వైఫల్యం అయ్యారు వివరణ ఇవ్వాలి అంటూ మూడు జిల్లాల ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఆదేశించారు. అలాగే పల్నాడు, ప్రకాశం ,నంద్యాల ఎస్పీలు కూడా తన ఎదుట హాజరు కావాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, నంద్యాల ఎస్పీ రఘు వీరా రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి.. ముగ్గురు ఏపీ సీఈవో ఎదురుగా హాజరయ్యారు. వారి ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై ఎస్పీలు ఇచ్చే విచారణ ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎస్పీల వివరణ సంతృప్తికరంగా లేకపోతే వారిపై కచ్చితంగా బదిలీ వేటు పడే అవకాశం కూడా ఉంది. దీంతో ప్రస్తుతం ఏపీ లో ఎక్కడ చూసినా తీవ్ర ఉత్కంఠత నెలకొని ఉంది.













