మూడు రాజధానుల అజెండాతోనే ఎన్నికలకు వెళ్తాం
మూడు రాజధానుల అజెండాతోనే ఎన్నికలకు వెళ్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అమర్నాథ్ తెలిపారు. పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులు, మంత్రులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ గతంలో అమరావతిపై చేసిన విమర్శలను ప్రజలు మర్చిపోలేదని, ప్రజల ఆకాంక్షమేరకే 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా ఈ నెల 15న విశాఖలో గర్జన నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు ఫిబ్రవరిలో విశాఖ నగరంలో పారిశ్రామిక సదస్సు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. ఎంఎస్ఎంఈలకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని, ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారన్నారు. అనుమతుల్లో జాప్యం లేకుండా త్వరగా క్లియరెన్స్ ఇచ్చేలా చూడాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.













