Vemireddy Prasanthi Reddy: నెల్లూరులో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన బెదిరింపు లేఖ..

నెల్లూరు (Nellore) జిల్లా రాజకీయలలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. కోవూరు (Kovvur) శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (Vemireddy Prasanthi Reddy) ఇంటికి వచ్చిన ఒక అపరిచితుడు అందజేసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నెల 17న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈనెల 17వ తేదీన ఒక వ్యక్తి ముఖానికి మాస్క్ వేసుకొని, ఎంసీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) నివాసానికి చేరుకున్నాడు. బయట ఉన్న భద్రతా సిబ్బందికి లేఖను ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ లేఖలో రెండు కోట్లు ఇవ్వాలని, లేకపోతే ప్రాణహాని తప్పదని స్పష్టంగా రాసి ఉండటం చూసిన సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని ఎమ్మెల్యే, ఎంపీకి తెలియజేయగా, వారు పోలీసులకు సమాచారమిచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసును అత్యంత గోప్యంగా విచారిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, లేఖ వెనుక ఉన్న వ్యక్తుల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దర్యాప్తు క్రమంలో అల్లూరు (Allur) మండలం ఇస్కపాళెం (Iskapalem) గ్రామానికి చెందిన ఒక వ్యక్తిపై అనుమానం వ్యక్తమైంది. అదేవిధంగా ఎంపీ-ఎమ్మెల్యే నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరిగిన మరో యువకుడిని ప్రశ్నించినప్పుడు అతని వద్ద నాలుగు మొబైల్ ఫోన్లు బయటపడటంతో అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా ఎటువంటి వివరాలు ప్రకటించలేదు. లేఖ అందిన విషయం నిజమేనని ధృవీకరించినప్పటికీ, దాని వెనుక ఉద్దేశ్యం ఏంటనే విషయం స్పష్టంగా చెప్పలేదు. ఇది రాజకీయ దాడా, లేక వ్యక్తిగత లావాదేవీల ఫలితమా అన్న సందేహం ఇంకా కొనసాగుతోంది. తాజాగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మధ్య జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సంఘటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సంఘటనతో నెల్లూరు జిల్లా అంతటా చర్చలు జోరందుకున్నాయి. ప్రజా ప్రతినిధిని నేరుగా ఇలాంటి విధంగా బెదిరించడం అసాధారణమని ప్రజలు భావిస్తున్నారు. భద్రతా వ్యవస్థలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరు, ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డారు అన్నదానిపై ఉత్కంఠ పెరుగుతోంది. పోలీసులు త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తారని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.