ఎపిలో పర్యాటకాభివృద్ధికి అవకాశాలు పుష్కలం
త్వరలోనే కొత్త టూరిజం పాలసీ: ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగానికి విస్తృత అవకాశాలు ఉన్నప్పటికీ పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిన్నదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టూరిజంలో ఆశించిన స్థాయిలో కొత్తగా పెట్టుబడులు రాలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తూ, ఇప్పటికైనా రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని మళ్ళీ పట్టాలపైకి ఎక్కించేందుకు కృషి చేయాలని కోరారు. దేశంలో టాప్ 5 రాష్ట్రాల్లో ఉన్న టూరిజం పాలసీలను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా కొత్త టూరిజం పాలసీ తీసుకురావాలని అన్నారు. గండికోట, విశాఖ ఏజెన్సీ, గోదావరీ నదీ పరివాహక ప్రాంతాల్లో టూరిజం ప్రాజెక్టులకు అనుకూల అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సీ ప్లేన్ టూరిజం తెచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు.
రాష్ట్రంలో ఎకో, టెంపుల్, బీచ్ టూరిజం అభివృద్దికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, నాడు ఒప్పందం చేసుకున్న ప్రాజెక్టులను మళ్లీ పట్టాలపైకి ఎక్కించడంతో పాటు పెట్టుబడిదారులతో మాట్లాడి కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలని అధికారులకు సీఎం సూచించారు. టెంపుల్ టూరిజంకు రాష్ట్రంలో విస్తృత అవకాశాలు ఉన్నాయన్న సీఎం ఎకో టూరిజం అభివృద్ధికి అటవీ శాఖతో కలిసి పనిచేయాలన్నారు. శ్రీశైలంలో టెంపుల్, వాటర్, అటవీ టూరిజం డెవలప్ చేయాలని సూచించారు. మన సంస్కృతీ సాంప్రదాయాలు, ఆహార అలవాట్లను చాటేలా ఆయా టూరిజం సెంటర్లను అభివృద్ది చేయాలన్నారు. ప్రముఖ హోటల్ నిర్మాణాలు పూర్తి చేసి వసతులు అందుబాటులోకి తేవాలన్నారు. టూరిజం సెంటర్‌కు వచ్చిన పర్యాటకులు ఒకటి రెండు రోజులు అక్కడ ఉండే వాతావరణం కల్పించాలని, అప్పుడు స్థానికులకు ఉపాధితోపాటు ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని అన్నారు.
టూరిజం అభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధులతో రూ.300 కోట్లతో శ్రీశైలం, రాజమండ్రి గోదావరి ప్రాంతం, సూర్యలంక బీచ్‌ల్లో టూరిజం ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలని అన్నారు. మన హస్తకళలు, చేనేత, గిరిజన ఉత్పత్తులు, చేతివృత్తుల ఉత్పత్తులను టూరిస్టు సెంటర్లలో ప్రమోట్ చేయడం ద్వారా వారికి ఆదాయ మార్గం లభిస్తుందని అన్నారు. రుషికొండ ప్యాలెస్ కోసం పెట్టిన ఖర్చులో సగం కూడా గత ప్రభుత్వం పర్యాటక రంగంపై పెట్టకపోవడం విచారకరమని ముఖ్యమంత్రి అన్నారు. టూరిజం అభివృద్ధి అనేది సామాన్య ప్రజలకు ఉపాధి కల్పనలో అత్యంత కీలకమైన దని అలాంటి రంగాన్ని కూడా నిర్వీర్యం చేశారని సీఎం అన్నారు. రానున్న రోజుల్లో టూరిజం అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ధిష్టమైన ప్రణాళికతో రావాలని అధికారులకు సీఎం సూచించారు.













