తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రాజెక్టుల గురించి అధికారులతో చర్చించిన ఉపరాష్ట్రపతి
• రేణిగుంట నుంచి వెంకటాచలం(నెల్లూరు) వరకూ రైలులో ప్రయాణించిన శ్రీ వెంకయ్యనాయుడు
• ప్రయాణించిన సమయంలో రైల్వే అధికారులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల గురించి ప్రత్యేక చర్చ
• కృష్ణపట్నం – ఓబులవారి పల్లె రైల్వే లైను మరియు నడికుడి – శ్రీకాళహస్తి మార్గం పనుల గురించి ప్రత్యేకంగా చర్చించిన ఉపరాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు అత్తగారి దశదిన కార్యక్రమాల కోసం ఢిల్లీ నుంచి నెల్లూరు బయలు దేరారు. ఢిల్లీ నుంచి రేణి గుంట విమానాశ్రయం చేరుకుని, అక్కడ నుంచి రైలు మార్గంలో వెంకటాచలం (నెల్లూరు) చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి రైలు ప్రయాణం చేయడమే కాకుండా, ఆ సమయాన్ని పలు రైల్వే ప్రాజెక్టుల గురించి అధికారులతో మాట్లాడేందుకు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు రైల్వే ప్రాజెక్టులు చర్చకు వచ్చాయి. ఈ సమావేశానికి జనరల్ మేనేజర్ శ్రీ ఆర్.కె.కులశ్రేష్ఠ, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ శ్రీ శివప్రసాద్, డి.ఆర్.ఎమ్. శ్రీ విజయ్ ప్రతాప్ సింగ్, ఆర్వీఎన్ఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ కమలాకర్ రెడ్డి హాజరయ్యారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం రవాణా సౌకర్యాలు కీలకమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, నూతన రైల్వే ప్రాజెక్టులతో పాటు ప్రస్తుతం ముందుకు సాగుతున్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులకు సూచించారు. ముఖ్యంగా కృష్ణ పట్నం-ఓబులవారిపల్లె రైల్వే లైను మరియు నడికుడి – శ్రీకాళహస్తి రైలు మార్గం పనుల గురించి ప్రత్యేకంగా అధికారులతో చర్చించారు. వీటితో పాటు గూడూరు విజయవాడ మూడో లైను, గుంటూరు-అమరావతి-విజయవాడ రైల్వేలైను, గుంతకల్లు స్టేషన్, నెల్లూరు నూతన స్టేషన్లతో పాటు గూడూరు, రేణిగుంట స్టేషన్లలో వైఫై సౌకర్యం గురించి చర్చించారు. వీటితో పాటుగా ఈ మధ్య రైల్వే ప్రవేశపెట్టిన సువిధ డైనమిక్ ఫెయిర్ ట్రైన్స్ గురించి కూడా మాట్లాడారు. వీటిలో టిక్కెట్టు ధరలు మరీ ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయని, మధ్యతరగతికి సౌకర్య వంతంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నెల్లూరు కడప జిల్లాల మధ్య ముడిసరుకుల రవాణా మరియు ప్రయాణ సౌకర్యాలు, కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులకు ఉద్దేశించిన కృష్ణపట్నం-ఓబుల వారి పల్లె రైల్వే లైన్ సొరంగం పనుల గురించి గతంలోనే రైల్వే మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ని తన ఛాంబర్ కు పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. అప్పట్లో రైల్వే బోర్డు చైర్మన్ లోహాని, ఆర్వీఎన్ఎల్ ముఖ్య అధికారి ప్రదీప్ గౌర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ ప్రాజెక్టు ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి కానున్నట్లు ఉపరాష్ట్రపతికి పూర్తి వివరాలను రైల్వే అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం ఆ పనుల గురించి మరో సారి ఉపరాష్ట్రపతి రైల్వే అధికారులతో చర్చించారు. ముందుగా తెలియజేసినట్లుగా ఫిబ్రవరి చివరి నాటికి పనులు పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు. రాయలసీమ మరియు కోస్తా ప్రాంతాలను కలుపుతూ, కడప-నెల్లూరు మధ్య ముడిసరుకుల రవాణా కోసం ఉద్దేశించిన ఈ ర్వైల్వే లైనును ప్రజా రవాణా కోసం కూడా అందుబాటులో తెచ్చేందుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించి, సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకునే దిశగా ఆలోచించాలని ఉపరాష్ట్రపతి గతంలోనే రైల్వే మంత్రికి సూచించారు. ఈ విషయాన్ని అధికారులకు కూడా వివరించి, దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
నడికుడి – శ్రీ కాళహస్తి రైల్వే లైను విషయంలోనూ ఉపరాష్ట్రపతి, రైల్వే అధికారులతో మాట్లాడారు. పనుల వేగం, ఏ సమయానికి పూర్తి కావొచ్చు తదితర అంశాల గురించి అడిగిన ప్రశ్నలకు రైల్వే అధికారులు వివరాలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం 2016 ఆగష్టులో 45 కి.మి విస్తీర్ణం కలిగిన భూమిని పిడుగురాళ్ళ – సవలాయ పురం మధ్య అందించిందని, అయితే అందులో రెండు చోట్లు భూమి విషయంలో వివాదాలు తలెత్తి, ప్రస్తుతం అది హైకోర్టులో వివాదం నడుస్తోందని, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వివరాలు అందించాల్సి ఉందని తెలిపారు. అధే విధంగా పిడుగురాళ్ళ – రొంపిచర్ల మధ్య వివాదంలో ఉన్న భూమి మినహా మిగిలిన ప్రదేశంలో పనులు పూర్తి అయ్యాయని, వివాదాలు తేలిన తర్వాత మిగిలిన చోట కూడా పని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఇప్పటికే పూర్తైన రైల్వే లైను విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి ఆమోదం రావలసి ఉందని తెలిపారు. ఈ విషయంలో వెంటనే చొరవ తీసుకోవాలని, వీలైనంత త్వరగా పనులు పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు. క్లియరెన్స్ రావలసిన కేంద్ర మంత్రిత్వ శాఖలతో తాను మాట్లాడతానని తెలిపారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న అన్ని రైల్వే ప్రాజెక్టుల గురించి చర్చించి, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వీటికి కావలసిన సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. అవసరమైన శాఖల మంత్రులతో తాను మాట్లాడతానని, ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయాలని తెలిపారు.













