కూటమి సర్కార్ కి పెను సవాలుగా మారుతున్న వలంటీర్ల వ్యవస్థ..
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలకు పైగా సమయం గడుస్తోంది. కాస్త ప్రభుత్వం కుదురుకుంటుంది అనుకునే సమయంలో కూటమి సర్కార్ కి పెద్ద చిక్కే ఎదురు కాబోతుంది. వలంటీర్ల వ్యవస్థ గురించి ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం మాట్లాడిన తీరుకి ఎన్నికల అనంతరం ప్రవర్తిస్తున్న తీరుకి ఎక్కడా పొంతన లేదు అంటున్నారు వలంటీర్ల నాయకులు. ఇచ్చిన హామీ ప్రకారం పదివేల రూపాయల చొప్పున వేతనాలు ఇవ్వలేదు సరి కదా.. అసలు ఉద్యోగం ఉందో లేదో కూడా తెలియని డైలమాలో తమని కూటమి ప్రభుత్వం పెట్టింది అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు వలంటీర్ల వ్యవస్థ పై కూటమి ప్రభుత్వం వ్యతిరేక భావనతోనే ఉంది. కానీ ఎన్నికల సమయంలో 5000 రూపాయలు ఉన్న వేతనాన్ని 10000 రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు పదేపదే ప్రచారం నిర్వహించిన సమయంలో చెప్పుకుంటూ వచ్చారు. దీంతో అప్పటివరకు జగనన్న సారదులుగా వ్యవహరించిన వలంటీర్ల బాబుని గెలిపించడం తమ బాధ్యత అన్నట్టు ప్రవర్తించారు. అనూహ్యంగా వలంటీర్లు కూటమి వైపు రావడంతో.. అటు జగన్ ఓడిపోవడం.. కూటమి గెలవడం సాధ్యపడింది అని అందరూ భావించారు.
కానీ ప్రభుత్వం ఏర్పాటయి రెండు నెలలు పూర్తవుతోంది.. త్వరలో మూడోనెల మొదలవుతుంది. ముచ్చటగా మూడు నెలలు గడుస్తున్న ఇంకా వలంటీర్ల విషయంలో కూటమి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇప్పటివరకు మౌనంగా ఉన్న వలంటీర్ లు.. ప్రభుత్వానికి ఎదురు తిరగడానికి సిద్ధమవుతున్నారు. కూటమి సర్కార్ పై ఒత్తిడిని తీసుకురావడానికి.. నిరసనలకు పిలుపునివ్వడానికి వారు సంసిద్ధులవుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే విజయవాడలో ఓ భారీ ర్యాలీని కూడా నిర్వహించడానికి వలంటీర్ల సంఘం భావిస్తోంది. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు గత రెండు నెలలుగా నిలిపివేసిన వేతనాలను కూడా తక్షణం విడుదల చేయాలి అన్న తమ డిమాండ్లను సర్కారు ముందు ఉంచ బోతున్నారు. గతంలో వైసీపీ సర్కారు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తుల విషయంలో ఇదే సమస్యను ఎదుర్కొంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వలంటీర్ల రూపంలో ఎదురు కాబోతున్న ఇదే సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.













