విద్యాసంస్థల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల పాత్ర కీలకం – ప్రకాశ్ జవడేకర్
ఘనంగా ఎయు పూర్వవిద్యార్థుల సమ్మేళనం
ప్రతి ఒక్కరి అభివృద్ధికి, ప్రగతికి పునాదులు వేసే విద్యాసంస్థలకు పూర్వవిద్యార్థులు సాధ్యమైనంత సాయం చేయాలని తాము చదువుకున్న విద్యాసంస్థల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ పూర్వ విద్యార్థులకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 10వ తేదీన జరిగిన ఆంధ్రవిశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థుల వార్షిక సమ్మేళనం ‘వేవ్స్ 2020’ కార్యక్రమానికి ఆయన ఆన్లైన్లో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సంవత్సరానికి ఒక్కరోజైనా వివిధ విద్యాసంస్థల పూర్వవిద్యార్థులు కలుసుకుని మాట్లాడుకుంటే వచ్చే ఆనందం వర్ణించలేనిదని అంటూ, ఇలాంటి సమ్మేళనం అన్నీ చోట్లా జరగాలన్నారు. కొవిడ్ నేపథ్యంలో పూర్వవిద్యార్థుల సమావేశాన్ని ఆన్లైన్ లో నిర్వహించినప్పటికీ వచ్చే సంవత్సరం మాత్రం విశ్వవిద్యాలయంలోనే నిర్వహించాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక ప్రపంచానికి తగ్గట్టుగా తయారవ్వాలని, 21వ శతాబ్దపు నైపుణ్యాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఎన్ని డిగ్రీలున్నా ప్రాథమిక నైపుణ్యాలు లేకపోతే ఉపయోగం ఉండదని సూచించారు. పూర్వవిద్యార్థుల చొరవతోనే విద్యాసంస్థలకు, పరిశ్రమలకు మధ్య సమన్వయం సాధ్యమవుతుందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏయూ తొలితరం విశ్వవిద్యాలయమని, దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలకు పెద్దన్న తరహాలో ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉన్న వర్సిటీ నుంచి వెళ్లి ఎంతోమంది దేశ, విదేశాల్లో కీలకస్థానాల్లో ఉన్నారని, ఎంతోమంది మేధావులను, నిపుణులను, విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, పార్లమెంట్ సభ్యులను, పార్లమెంట్ స్పీకర్లను, ఉపరాష్ట్రపతిని, రాజకీయ వేత్తలను అందించిన ఘనత వర్సిటీ సొంతమన్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న పూర్వవిద్యార్థులతో ఆంధ్ర విశ్వవిద్యాలయం వసుదైవ కుటుంబమైంది. ఇప్పుడు మీ మార్గదర్శకత్వం, సహకారం నేటి తరానికి అందించాలి. వర్సిటీకి చోదశక్తిగా నిలవాలి అని కోరారు.
ఏయూ విశ్రాంత వీసీ ఆచార్య బీలా సత్యనారాయణ ప్రారంభోపన్యాసం చేశారు. పరిశోధనలు, ఆవిష్కరణలదిశగా మరింత ప్రగతి సాధించే ప్రయత్నంలో ఏయూకు పూర్వవిద్యార్థుల సహకారం ఎంతో అవసరమన్నారు. కరికులం రూపకల్పనలో, జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని విద్యార్థులకు అందించడంలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పూర్వ రెక్టార్ ఆచార్య ఎ.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ 1926లో ప్రారంభమైన ఏయూను కట్టమంచి రామలింగారెడ్డి అభివృద్ధి చేసిన విధానాన్ని వివరించారు. దలైలామా వంటి ఆధ్యాత్మిక వేత్తలకు ఏయూ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసిందన్నారు. మధర్ థెరిసా సందర్శించిన వర్సిటీగా ఏయూ పవిత్ర స్థానాన్ని పొందిందని చెప్పారు.
ఇక్ఫా యూనివర్సిటీ వీసీ కమోడోర్ హెచ్.పి.సింఘ్, కేంద్ర రక్షణమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పి.హరి ప్రసాద్, సినీ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు, ఏయూ పాలక మండలి సభ్యురాలు గిరిజా అగస్టీన్, జేమ్స్ స్టీఫెన్, పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి బి.మోహన వెంకట రామ్, సంయుక్త కార్యదర్శి కె.కుమార్ రాజ, రిజిస్ట్రార్ వి.క్రిష్టమోహన్, తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచవ్యాప్తంగా పూర్వ విద్యార్థులు వీక్షించారు. తమ అభిప్రాయాల్ని ఆన్లైన్లో పంచుకున్నారు.
Click here for Video Link: https://youtu.be/stZ_0kU8eqo













