Jagan: జగన్ ఇమేజ్ కి పరీక్షగా మారనున్న..కోటి సంతకాల ప్రజా పోరాటం..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy) తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమానికి పిలుపునిచ్చారు. నర్సీపట్నం (Narsipatnam)లో ఉన్న మెడికల్ కాలేజీని సందర్శించిన అనంతరం ఆయన పార్టీ పోరాట రణతంత్రాన్ని ప్రకటించారు. తన ప్రభుత్వ కాలంలో మంజూరైన 17 మెడికల్ కాలేజీలను పూర్తిగా ప్రభుత్వం నిర్మించి, నిర్వహించాలనే డిమాండ్‌తో జగన్ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.
గత 75 ఏళ్లలో రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పడగా, తన పాలనలో ఒక్కసారిగా 17 కాలేజీలను ప్రారంభించామన్నారు. అందులో ఐదు ఇప్పటికే ప్రారంభమై ప్రజలకు సేవలందిస్తున్నాయని, మిగిలిన 12 కాలేజీల నిర్మాణం కూడా ప్రభుత్వం స్వయంగా చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. పీపీపీ (PPP) విధానంలో ప్రైవేట్ సంస్థలకు వాటిని అప్పగించడం ప్రజా వ్యతిరేక నిర్ణయం అవుతుందని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తానని జగన్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ సమగ్ర షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. అక్టోబర్ 10న ప్రారంభమై నవంబర్ 25 వరకు సాగే ఈ ఉద్యమం “కోటి సంతకాల ప్రజా పోరాటం” (One Crore Signatures Movement)గా నిర్వహించబడనుంది. గురువారం ఆయన ప్రకటన అనంతరం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy), ఇతర నేతల సమక్షంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఉద్యమం మొదటి దశలో గ్రామస్థాయిలో సంతకాల సేకరణ జరుగుతుంది. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు ప్రతి గ్రామంలో ప్రజలు పాల్గొని తమ సంతకాలను ఇవ్వనున్నారు. నవంబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో కూడా ప్రజా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది.
తరువాత దశలో, నవంబర్ 23న సేకరించిన సంతకాల పత్రాలను నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు తరలిస్తారు. నవంబర్ 24న లారీలలో వాటిని తాడేపల్లిలోని (Tadepalli) పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చి ప్రజల సమక్షంలో ప్రదర్శిస్తారు. చివరిగా నవంబర్ 25న ఆ కోటి సంతకాల పత్రాలను గవర్నర్‌కు సమర్పించనున్నారు.
ఈ ఉద్యమం ద్వారా ప్రజల అభిప్రాయం స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే జగన్ ఉద్దేశ్యంతో ఉన్నారు. ప్రజా ఆస్తులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇవ్వడం సరైంది కాదని, ప్రజల ఆరోగ్య హక్కులను కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. మెడికల్ విద్య మరియు వైద్య సేవలు ప్రభుత్వ బాధ్యతగా కొనసాగాలని, ప్రజలు కూడా దీనిపై స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయంగా కూడా ఈ ఉద్యమం జగన్ మోహన్ రెడ్డికి ఒక పరీక్షగా మారింది. ప్రజల మద్దతు ఎంతవరకు లభిస్తుందో, ప్రభుత్వం ఈ ఒత్తిడికి ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.