AP Government: జీఎస్టీ దెబ్బ,ఉచిత హామీల భారం.. ఆందోళనలో ఏపీ ఆర్థిక పరిస్థితి..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ కఠినంగా మారుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. 2014 జూన్ 2 న రాష్ట్ర విభజన జరిగినప్పటినుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోయిందన్నది వాస్తవం. రాజకీయంగా తీవ్రమైన పోటీ ఉండటంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీలు అనేక ఉచిత హామీలు ఇస్తూ వచ్చాయి. అదే సమయంలో ఆదాయ వనరులు బలపడకపోవడం రాష్ట్ర ఖజానాపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చింది.
విభజన సమయంలోనే ఏపీ భారీ రెవెన్యూ లోటుతో ప్రారంభమైంది. కాగ్ (CAG ) నివేదిక ప్రకారం 2014–15 ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 24,194 కోట్ల రూపాయల లోటు నమోదైంది. ఆ తర్వాత ఆదాయాన్ని తెచ్చే హైదరాబాద్ (Hyderabad) వంటి మహానగరం లేకపోవడంతో లోటు క్రమంగా పెరుగుతూ వచ్చింది. సంవత్సరానికోసారి ఆదాయానికి, ఖర్చులకు మధ్య అంతరం పెరిగి చివరకు సాధారణ పరిపాలనా అవసరాలకే రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రెండో దశ జీఎస్టీ (GST) సంస్కరణల పేరుతో ఈ ఏడాది అక్టోబర్ నుంచి కొత్త స్లాబులు అమల్లోకి తీసుకొచ్చింది. మధ్యతరగతి, దిగువ తరగతికి ఊరట కలిగించాలన్న ఉద్దేశంతో అనేక వస్తువులను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించారు. దీని వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయం తగ్గిపోయింది. ఏపీకి సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందన్న అంచనాలు అప్పుడే వినిపించాయి. కానీ వాస్తవంగా చూస్తే ఈ ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు.
గణాంకాలు పరిశీలిస్తే గత ఏడాది అక్టోబర్లో జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి 2,777 కోట్ల రూపాయలు ఆదాయం రాగా, ఈ ఏడాది అదే నెలలో అది స్పష్టంగా తగ్గింది. అలాగే గత ఏడాది నవంబర్ లో 2,827 కోట్ల రూపాయలు వచ్చిన చోట ఈ ఏడాది నవంబర్లో కేవలం 2,697 కోట్ల రూపాయలకే పరిమితమైంది. అంటే సుమారు నాలుగు శాతం కంటే ఎక్కువగా ఆదాయం తగ్గినట్టు లెక్కలు చెబుతున్నాయి.
జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు వచ్చిన నష్టాన్ని కేంద్రం ఏదో రూపంలో భర్తీ చేయాల్సి ఉన్నా, ఆ దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి ఈ దెబ్బ ఎక్కువగా తగిలిందని విశ్లేషకులు అంటున్నారు. గత పదకొండేళ్లలో పరిశ్రమలు, సేవారంగం పెద్దగా ఆదాయాన్ని తీసుకురాలేకపోయాయి. ఇప్పటికీ వ్యవసాయ రంగంపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.
ఇదే సమయంలో ప్రభుత్వంపై ఖర్చుల భారం భారీగా పెరిగింది. సామాజిక పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచి సుమారు 65 లక్షల మందికి చెల్లిస్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతులకు అన్నదాతా సుఖీభవ వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. వీటితో పాటు ఇతర హామీలు కూడా ఉన్నాయి. ఆదాయం తగ్గి, ఖర్చులు పెరగడంతో అప్పులపై ఆధారపడక తప్పడం లేదు. అమరావతి (Amaravati) రాజధాని అభివృద్ధి కోసం కూడా రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. మొత్తం మీద రాష్ట్ర ఆర్థిక స్థితి ఆందోళనకరంగా ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏపీ ఆర్థిక పరిస్థితిని క్రమబద్ధీకరించడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి..






