Vangaveeti Radha: రాజకీయాలకతీతంగా నిలిచిన వంగవీటి, కొడాలి, వల్లభనేని స్నేహం..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కి చెందిన కీలక నేతలు కొడాలి నాని (Kodali Nani), వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ఇటీవల టీడీపీ (TDP) నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా (Vangaveeti Radha) తో కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా (Krishna District) కు చెందిన ఈ ముగ్గురు ఒకప్పుడు అత్యంత సన్నిహిత స్నేహితులు. రాజకీయాలు మారినా, వారి మధ్య ఉన్న బంధం కొనసాగుతూనే ఉందని ఈ ఫొటో మరోసారి నిరూపించింది.
వంగవీటి కుటుంబం (Vangaveeti Family) ఆ ప్రాంతంలో విశేషమైన ప్రజాదరణను కలిగి ఉంది. ముఖ్యంగా రాధా తండ్రి వంగవీటి మోహనరంగా (Vangaveeti Mohan Ranga) పట్ల ఉన్న అభిమానాన్ని, ఆయన మరణం తర్వాత ప్రజలు రాధాకృష్ణ (Radha Krishna) పట్ల చూపిస్తున్నారు. రాధా గతంలో పీఆర్ఫీ, కాంగ్రెస్, వైసీపీ తరఫున ఎమ్మెల్యే పదవికి పోటీ చేశారు. ఒకసారి విజయం సాధించిన ఆయన, చివరి రెండు ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. ప్రస్తుతం ఆయన టీడీపీకి చేరి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) రాధాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాధా భార్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు సన్నిహిత బంధువుగా ఉండటంతో, ఈ స్నేహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రిని తరచుగా విమర్శించే వైసీపీ నేతలు కొడాలి, వల్లభనేనితో రాధా స్నేహం కొనసాగడం ఆసక్తికరంగా మారింది.
ఇంతకుముందు రాధా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, కొడాలి, వల్లభనేని టీడీపీలో ఉన్నారు. రాధా టీడీపీలోకి వచ్చేసరికి కొన్ని అనుకోని కారణాలవల్ల ఆ ఇద్దరు వైసీపీలో చేరారు. రాజకీయ మార్పులు జరిగినా, వారి మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధం మాత్రం అలాగే కొనసాగింది. అయితే, గత ప్రభుత్వంలో కొడాలి ,వల్లభనేని వ్యవహరించిన తీరు కారణంగా రాధా వారితో కొంత దూరంగా ఉన్నారని తెలిసింది. కానీ, రాధా కుటుంబ కార్యక్రమాలకు మాత్రం వారిని ఎప్పుడూ ఆహ్వానిస్తారని సన్నిహితులు చెబుతున్నారు.
ఇటీవల వంగవీటి రాధాకు కుమార్తె జన్మించగా, సోమవారం రాత్రి ఉయ్యాల కార్యక్రమం కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకకు కొడాలి నాని , వల్లభనేని వంశీ హాజరై, చిన్నారిని ఆశీర్వదింఈచారు. ఈ సందర్భంగా ముగ్గురు కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని చూసిన నెటిజన్లు “రాజకీయాలు వేరు, స్నేహం వేరు” అని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, ఇటీవల జైల్లో ఉన్న సమయంలో అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారని ప్రచారం జరిగిన కొడాలి , వల్లభనేని ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపించడంతో వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా, ఈ ఫొటో రాజకీయ విభేదాల మధ్యన స్నేహం ఎప్పటికీ నిలుస్తుందనే సందేశాన్ని ఇచ్చిందని చెప్పాలి.