Chandrababu: అమరావతిలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి ముహూర్తం ఖరారు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) ఎట్టకేలకు రాజధాని అమరావతిలో సొంత ఇంటిని నిర్మించుకోబోతున్నారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతలు చంద్రబాబుకు అమరావతిలో సొంత ఇల్లు కూడా లేదని విమర్శించేవారు. ఇప్పుడు ఆ విమర్శలకు చెక్ పెడుతూ చంద్రబాబు అమరావతిలో (Amaravati) స్థిరనివాసం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏప్రిల్ 9న వెలగపూడిలోని (Velagapudi) E6 రోడ్డు వద్ద 5 ఎకరాల స్థలంలో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది.
చంద్రబాబు నాయుడు గతంలో హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ (Jubilee Hills) లో నివసిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఆయనకు అక్కడ నివాసం ఉంది. ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించిన తర్వాత కృష్ణానది ఒడ్డున ఉండవల్లిలో (Undavalli) తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. 2014-2019 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ఆయన కృషి చేశారు. అయితే, 2019లో వైసీపీ (YCP) అధికారంలోకి రావడంతో అమరావతి ప్రాజెక్టు స్తంభించిపోయింది. ఈ సమయంలో వైసీపీ నేతలు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. అమరావతిలో ఆయనకు సొంత ఇల్లు లేదు.. ఆయనకు రాజధానిపై నిబద్ధత లేదు అని ఆరోపించారు. ఈ విమర్శలు చంద్రబాబుని డిఫెన్స్ లో పడేసినట్లయింది.
2024 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి విజయం సాధించడంతో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. అమరావతి పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ రాజధాని అభివృద్ధికి భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత ఇంటిని నిర్మించుకోవడం ద్వారా తాను స్థానికుడినని చెప్పుకోవడమే కాదు.. అమరావతి పట్ల తన నిబద్ధతను చాటిచెప్పినట్లవుతుంది. ఇప్పటేక ఆయన వెలగపూడిలో 5 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇందులో ఇంటితో పాటు గార్డన్, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ సౌకర్యాలతో కూడిన ఆధునిక నిర్మాణం ఉంటుందని సమాచారం. రెండేళ్లలో ఈ ఇంటిని పూర్తి చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
గతంలో వైసీపీ ప్రభుత్వం అమరావతిని విస్మరించి, మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చినప్పుడు చంద్రబాబు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలన్నది ఆయన కల. ఇప్పుడు సొంత ఇంటి నిర్మాణంతో ఆ కలలో భాగస్వామ్యం అవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇది కేవలం ఇల్లు కాదని.. అమరావతి పట్ల చంద్రబాబుకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని టీడీపీ నేతలు చెప్తున్నారు.
మరోవైపు చంద్రబాబు నిర్ణయం వైసీపీ విమర్శలకు తాత్కాలికంగా చెక్ పెట్టినట్లయింది. అయితే.. ఇది మరిన్ని కొత్త చర్చలకు దారితీసే అవకాశం ఉంది. అమరావతి అభివృద్ధి కంటే చంద్రబాబు తన ఇంటి నిర్మాణానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ నేతలు విమర్శించే అవకాశం లేకపోలేదు. అయితే, టీడీపీ కార్యకర్తలు మాత్రం దీన్ని సానుకూలంగా చూస్తున్నారు. చంద్రబాబు ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకోబుతున్నారంటే అమరావతి అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని భావిస్తున్నామని వాళ్లు చెప్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులు త్వరలో ప్రధాని మోదీతో (PM Modi) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన ఇంటి భూమిపూజను ఒక శుభసూచకంగా భావిస్తున్నారు. రాజధానిగా అమరావతిని పునరుద్ధరించడంతో పాటు, తన వ్యక్తిగత జీవితంలో కూడా ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.













