పశ్చిమ బెంగాల్లో కేంద్రం చర్య దుర్మార్గం రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు : చంద్రబాబు
పశ్చిమ బెంగాల్లో కేంద్రం చర్య దుర్మార్గమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్రాల్ని తమ నియంత్రణలో ఉంచుకోవాలనే కేంద్రం తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్ధమని.. దీనిపై అంతా ఐక్యంగా పోరాడుతామని స్పష్టంచేశారు. పార్టీ నేతలతో చంద్రబాబు ఈ ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
సహకార సమాఖ్య వ్యవస్థ అన్న మోదీ ఇప్పుడు రాష్ట్రాల హక్కులు కాలరాస్తున్నారని చంద్రబాబు ఆగ్రహాం వ్యక్తంచేశారు. భాజపాకి లొంగిపోయిన వారిపై కేసులు ఎత్తివేస్తున్నారు.. భాజపాని ఎదిరిస్తే పాతకేసులు బయటకు తీస్తున్నారన్నారు. మొన్న అఖిలేశ్, మాయావతిని లక్ష్యంగా చేసుకున్నారని.. ఇప్పుడు మమతా బెనర్జీపై కక్ష సాధింపునకు దిగారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలందరిపై కేసులు పెట్టి భాజపా ఆనందపడుతోందని విమర్శించారు. దేశస్థాయిలో ఉద్యమానికి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నమని.. అన్నిపార్టీలను సమన్వయం చేస్తూ జాతీయపార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ రోజు దిల్లీ పర్యటనలో కూడా దీనిపైనే చర్చిస్తామని ముఖ్యమంత్రి నేతలకు వివరించారు. తిత్లీ తుపాను బీభత్సం సృష్టిస్తే భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా రాలేదు కానీ.. 4 నెలల తర్వాత ఇప్పుడు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. అమిత్ షా పలాస పర్యటన రాజకీయస్వార్థం కోసమేనని.. ‘ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు’ అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రజల నిరసనల తీవ్రతను మోది, షా లు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.













