Kommineni: బెయిల్ మంజూరైన బయటకురాని కొమ్మినేని.. టెన్షన్ లో వైసీపీ

సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao) పరిస్థితి “దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించలేదు.” అనే తెలుగు సామెతను గుర్తు చేస్తోంది.సుప్రీంకోర్టు (Supreme Court) ఆయనకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఇంకా జైలు నుంచి విడుదల కాలేకపోయారు. బెయిల్ రావడంతో కొమ్మినేని బయటికి వస్తాడు అని ఆశించిన వైసీపీ శ్రేణులకు ఇది పెద్ద షాక్ అనడంలో సందేహం లేదు. సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో జర్నలిస్టు కృష్ణంరాజు (Krishnam Raju) అమరావతి (Amaravati) మహిళలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఈ డిబేట్‌ను యాంకర్‌గా వ్యవహరించి మొత్తం కార్యక్రమాన్ని నడిపించిన కొమ్మినేని అప్పట్లో ఏమీ అడ్డుకోకపోవడం వల్ల విమర్శల బాట పట్టారు. అంత సెన్సిటివ్ టాపిక్ మాట్లాడుతుంటే ఎక్స్పీరియన్స్ కలిగిన జర్నలిస్ట్ గా అడ్డుకోవాల్సింది పోనిచ్చి..ఆయన ముసిముసిగా నవ్వడమే కేసులో ప్రధాన అంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చర్యలు తీసుకుని, కృష్ణంరాజును కేసులో ప్రధాన నిందితుడిగా (A1), కొమ్మినెనిని రెండవ నిందితుడిగా (A2) పేర్కొంది. దాంతో ఇద్దరినీ అరెస్టు చేసి గుంటూరు (Guntur) జిల్లా జైలులో ఉంచారు.
శుక్రవారం సుప్రీంకోర్టు కొమ్మినేనికి బెయిల్ ఇచ్చింది. తక్షణమే విడుదల చేయాలని కూడా ఆదేశించింది. కానీ అదే రోజు సాయంత్రం దాకా కోర్టు ఉత్తర్వులు ట్రయల్ కోర్టుకు (Trial Court) చేరలేదు. మరుసటి రోజు రెండవ శనివారం కావడంతో కోర్టులు సెలవులోకి వెళ్లాయి. ఆపై ఆదివారం కూడా సెలవే. ఈ విధంగా మూడు రోజులు గడిచిపోయాయి. సోమవారం అయినా బెయిల్ కండిషన్స్ తుది రూపు దాల్చి ఆయన విడుదలకు మార్గం తేలుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేనిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతలు కొమ్మినేనికి బెయిల్ మంజూరు అయిన వెంటనే హర్షం వ్యక్తం చేశారు. ఆయన విడుదలపై ఆశతో వేచి ఉన్నా, కోర్టు ప్రక్రియల్లో జాప్యం తలెత్తింది. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చినా, వాటిని అనుసరించి ట్రయల్ కోర్టు నుంచి ఉత్తర్వులు రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ విడుదల ప్రక్రియ నిలకడగా కొనసాగుతుంది.
ఇప్పుడు వైసీపీ లీగల్ టీమ్ (YCP legal team) ఇరు కోర్టుల మధ్య తిరుగుతూ అన్ని దశలు పూర్తి చేయాలని శ్రమిస్తోంది. సోమవారం ఈ కృషి ఫలిస్తే కొమ్మినేని జైలు నుంచి బయటకు వస్తారు. లేదంటే మళ్లీ మరొక రోజు ఆలస్యం కావాల్సి ఉంటుంది. మొత్తానికి కొమ్మినేని బెయిల్ పై ఎప్పుడు వస్తారు అనే విషయం తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాలి..