ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ హైకోర్టు కొలీజియం న్యాయమూర్తుల నియామకానికి గతేడాది న్యాయవాదుల పేర్లను సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది. ఇందులో ఏడుగురిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు పంపింది. వీరిలో న్యాయవాదులు కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణప్రసాద్, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, తార్లడ రాజశేఖర్‌రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీమలపాటి, వడ్డిబోయిన సుజాత ఉన్నారు.
జనవరి 29న సమావేశమైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తుల నియామకానాకి సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు అనుగుణంగా నోటిఫికేషన్ వెలువడిరది. 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 20 మంది పనిచేస్తున్నారు. తాజాగా మరో ఏడుగురు న్యాయమూర్తుల నియామకం కావడంతో ఆ సంఖ్య 27కి చేరింది. ఏపీ హైకోర్టుకు ఒకేసారి ఏడుగురు కొత్త న్యాయమూర్తుల నియామకాలకు పచ్చజెండా ఊపడం విశేషం.