Minister Srinivas: ప్రవాసాంధ్రుల అభ్యున్నతే ఏపీ ఎన్నార్టీ ధ్యేయం : మంత్రి కొండపల్లి
ప్రవాసాంధ్రుల అభ్యున్నతే ఏపీ ఎన్నార్టీ ధ్యేయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas) అన్నారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ 14 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం తాడేపల్లిలోని ఏపీ ఎన్నార్టీ కార్యాలయం (AP NRT Office) లో జరిగింది. ప్రధానంగా పరిపాలనా పరమైన అంశాలు, పద్దుల నిర్వహణ, ట్రస్ట్ వ్యవహారాలు, విధానపరమైన నిర్ణయాలు, గత రెండేళ్ళుగా ఎన్నార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై చర్చ జరిగింది. అమరావతి (Amaravati)లో నిర్మించ తలపెట్టిన ఐకానిక్ ప్రాజెక్ట్, పురోగతిపై సమీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ ఉండాలని, ప్రధానంగా ఎన్నారైల అభ్యున్నతి కొరకు కృషి చేయాలని నిర్ణయించారు. ఏపీ ఎన్నార్టీ సభ్యత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రవాసాంధ్రులతో చైతన్యం తీసుకురావాలని, ఎన్నార్టీని విదేశాల్లో ఉన్న ప్రతీ తెలుగు పౌరుడికి చేరువ చేయాలని, సంస్థ నిస్పక్షపాతంగా సేవలు అందించే దిశగా ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు వారికి అండగా నిలబడటమే కాకుండా రాష్ట్రంలో ఉన్న వారి కుటుంబాలకు సైతం దైర్యం కల్పించే దిశగా సంస్థ ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్నార్టీ సీఈఓ హేమల (Hemala) , ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు వేమూరి రవి కుమార్ (Vemuri Ravi Kumar) , ఇతర కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.













