Murali Nayak: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్ మురళీ నాయక్ చివరి కోరిక అదే..
ఆర్మీలో విధులు నిర్వహిస్తూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ (Murali Nayak) కథ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం కళ్లితండా గ్రామానికి చెందిన మురళీ, పేద కుటుంబంలో జన్మించినా చిన్నప్పటి నుంచే జవాను కావాలని కలలు కన్నాడు. తన లక్ష్యాన్ని సాధించేందుకు ఎంతో కష్టపడి చివరకు 2022లో గుంటూరులో (Guntur) నిర్వహించిన ఎంపికలో అగ్నివీర్‌గా ఎంపికయ్యాడు. దేశసేవకే అంకితమయ్యిన అతను ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) సరిహద్దుల్లో 851 లైట్ రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.
పంజాబ్ (Punjab) , అస్సాం (Assam) లాంటి ప్రాంతాల్లో పని చేసిన మురళీకి రెండు సంవత్సరాలకుపైగా సేవ అనుభవం ఉంది. రైల్వేలో ఉద్యోగం వచ్చినా, దేశం కోసం సేవ చేయాలనే తపనతో ఆ అవకాశం వదిలిపెట్టాడు. చిన్నతనం నుంచి దేశభక్తి గల మురళీని అతడి తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయి ఎంతో కష్టపడి చదివించారు. తల్లిదండ్రులు ముంబయిలో కూలీలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మురళీ తన చదువును సొంత ఊరైన సోమందేపల్లి, అనంతపురం ప్రాంతాల్లో పూర్తి చేశాడు.
ఇటీవలే స్వగ్రామంలో జరిగిన జాతరకు తల్లిదండ్రులు ముంబయి నుంచి వచ్చారు. ఆనందంగా బంధువులతో గడిపారు. అయితే అఘటించని విషాదం వారిని కుదిపేసింది. ఆపరేషన్ సిందూర్‌లో (Operation Sindhoor) విధుల్లో పాల్గొన్న మురళీ దేశరక్షణ కోసం పోరాడుతూ వీరమరణం పొందాడు. మురళీ తల్లిదండ్రులు అతడి పెళ్లికి సిద్ధంగా ఉండగా, కుమారుడి మరణవార్తతో శోకసాగరంలో మునిగిపోయారు. కొత్తగా కట్టించిన ఇంటిలో ఇప్పుడు శూన్యతే మిగిలింది. మురళీకి ఒక్కగానొక్క సంతానంగా ఉన్న తల్లిదండ్రుల బాధను చెప్పటానికి మాటలు చాలవు. అతని స్నేహితులు కూడా ఈ వార్తతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. డిప్రెషన్లో ఉన్న సమయంలో మురళీ తనను మోటివేట్ చేశాడని, తన ఫ్రెండ్ చెప్పిన మాటలు గుండెను తడిమేలా ఉన్నాయి. మరణానికి ముందు తన స్నేహితుడికి ఫోన్ చేసి తల్లిదండ్రుల బాధ్యతలు అప్పగించాడని చెబుతున్నారు.
మురళీ నాయక్ పార్థివదేహం ఇవాళ రాత్రి 7 గంటలకు తండాకు చేరుకుంటుంది. ర్యాలీగా గ్రామానికి తీసుకెళ్లి రేపు మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. రాష్ట్ర మంత్రి సవిత (Minister Savitha) మురళీ కుటుంబానికి 5 లక్షల చెక్కు అందించి, గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్థులు అతడిని కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో రానున్నారు.













