పొత్తులపై బీజేపీ నేత టీజీ వెంకటేశ్ స్పష్టత!
ఏపీలో బీజేపీ పొత్తులపై ఆ పార్టీ సీనియర్ నేత టీజీ వెంకటేశ్ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పొత్తుల అంశంపై చర్చ మరింత ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ నేత టీజీ వెంకటేశ్ స్పందించారు. ఎలక్షన్లకు మూడు నెలల ముందే పొత్తుల వివరాలు ఖరారు అవుతాయని అభిప్రాయపడ్డారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగానే పొత్తులు ఉంటాయని తెలిపారు. వైసీపీ సర్కారును గద్దె దించడమే బీజేపీ అజెండా అని, ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తమతో ఉంటారనే భావిస్తున్నట్లు వెంకటేశ్ చెప్పారు. వైసీపీ, బీజేపీ ఒకటే అంటూ జరుగుతున్న ప్రచారంపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. కేంద్రం మద్దతు నుంచి ఏపీ ప్రభుత్వానికి మాత్రమే మద్దతు ఇచ్చిందని, అంతేకానీ వైసీపీ ప్రభుత్వానికి కాదని తేల్చిచెప్పారు. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రానికి మద్దతు ఇచ్చిందని, దాన్ని అంతవరకే చూడాలని స్పష్టం చేశారు. దీంతో ఏపీలో వైసీపీకి బీజేపీ మద్దతు ఇస్తోందంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు.













