సైకిల్ పైన గ్లాసా ..గ్లాసులో సైకిలా.. కన్ఫ్యూజ్ చేస్తున్న టిడిపి జనసేన కూటమి లోగో..
ఎన్నికల దగ్గర పడుతున్న ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో పలు రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను ఫిబ్రవరి 24 మాఘ పౌర్ణిమ సందర్భంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రకటించాయి. 94 స్థానాలకు టిడిపి తమ అభ్యర్థులను ప్రకటించగా 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలలో పోటీ చేయనున్నట్లు జనసేన తెలిపింది. అంటే మొత్తం 118 అసెంబ్లీ స్థానాలకు గాను అభ్యర్థులను ఈ రెండు పార్టీలు కలిపి ప్రకటించాయి మిగిలిన 54 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ అభ్యర్థుల జాబితా పై బీజేపీతో పొత్తు విషయం ఫైనల్ అయ్యాక క్లారిటీ వస్తుంది అని టాక్.
అయితే టిడిపి జనసేన తమ మొదటి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించే సందర్భంగా.. వారి ఉమ్మడి పొత్తుకు సూచనగా ఒక లోగోని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టిడిపి ప్రధాన గుర్తు సైకిల్ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు. ఈ రెండిటినీ కలిపితే టిడిపి రంగ అయిన పసుపు జనసేన రంగ అయినా ఎరుపు రిబ్బన్లు మాదిరిగా ఉన్న ఒక లోగోను ఆవిష్కరించారు. అయితే ఈ ఉమ్మడి లోగో ప్రస్తుతం పలు రకాల చర్చలకు దారితీస్తోంది.
ఇప్పటికైనా తమ పార్టీకి గుర్తింపు వచ్చింది అని జనసైనికులు సంబర పడుతుంటే కొందరు తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం లోగో మార్పుపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సహజంగా కూటమి అంటే పార్టీలు తమ సొంత గుర్తులతో బ్యానర్లను ఫ్లెక్సీలను ప్రదర్శిస్తారు. అయితే వీటికి భిన్నంగా తమ మధ్య తారతమ్యాలు లేవు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ చంద్రబాబు ఈ లోగో ని ఆవిష్కరించారు. ఈ లోగో రెండు పార్టీల మధ్య సత్సంబంధాలను పెంచడానికి ఏర్పాటు చేసి ఉంటారు అన్న అభిప్రాయం గట్టిగా వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు ,కార్యకర్తలు ఈ లోగోని సోషల్ మీడియాలో షేర్ చేసి హడావిడి చేస్తున్నారు.













