ఏపీ మంత్రికి తెలంగాణ ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియను తెలంగాణ ఫ్యాప్సీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న టూరిజం కాంక్లేవ్-2018కు అతిథిగా రావాలని కోరారు. ఫ్యాప్సీ డైరెక్టర్ పి.వైదేహీ, టూరిజం కాంక్లేవ్-2018 చైర్మన్ వాల్మీకి హరికృష్ణ అమరావతి సచివాలయంలో మంత్రి అఖిల ప్రియను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానాన్ని అందించారు. హైదరాబాదులోని హోటల్ మారియట్‌లో జూన్ 28 నుంచి 30 వరకు నిర్వహించే టూరిజం కాంక్లేవ్-2018కు ఆంధ్రప్రదేశ్ నుంచి అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు వివరించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పర్యాటకం అభివృద్ధికి పరస్పర సహకారాన్ని కోరుతున్నామని డైరెక్టర్ వైదేహీ తెలిపారు. వచ్చే సెస్టెంబరులో నిర్వహించే ఏపీ టూరిజం కాంక్లేవ్‌కు తెలంగాణ నుంచి తాము పూర్తి సహకారాన్ని అందిస్తామని అన్నారు. దీనిపై స్పందించిన మంత్రి అఖిల ప్రియా పర్యాటక అభివృద్ధికి ఇరు రాష్ట్రాల సమైక్య ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ టూరిజం కాంక్లేవ్-2018కు ఏపీ నుంచి ప్రతినిధి బృందం హాజరవుతుందని పేర్కొన్నారు.













