నంద్యాల ప్రచారంలో తెలంగాణ టీడీపీ నేతలు
నంద్యాల ఎన్నికల ప్రచారాల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు చురుకుగా పాల్గొంటున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు వంటేరు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి అమరనాథ్బాబు తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. టీడీపీకి ఓటు వేసి నంద్యాలలో పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని, చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని ఓటర్లను కోరారు. నంద్యాలలో తమ అభ్యర్థికి 25వేల ఓట్లకు తగ్గకుండా మెజార్టీ వస్తుందన్నారు. నంద్యాల గెలుపుతో 2019 లో రాష్ట్రంలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. పారదర్శకమైన విధానాలతో ముందుకు సాగుతున్నారని, పథకాలు, నిధుల దుర్వినియోగం లేకుండా స్ఫూర్తిదాయకంగా పాలన సాగుతుందన్నారు. రోడ్లు, త్రాగునీరు, సాగు నీరు, ఇళ్ళ నిర్మాణం, ఇతర అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.













