ఐఏఎస్ శ్రీలక్ష్మిని హైకోర్టు క్లీన్ చిట్..! చీఫ్ సెక్రటరీ అయ్యేందుకు మార్గం సుగమం..!!
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి పెద్ద ఊరట లభించింది. ఇన్నాళ్లూ తనను వెంటాడిన ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆమెకు విముక్తి లభించింది. దీంతో ఆమె అత్యున్నత చీఫ్ సెక్రటరీ పదవి దక్కించుకునేందుకు మార్గం సుగమమైంది. 11 ఏళ్లుగా ఈ కేసు నడుస్తోంది. అయితే ఇవాళ తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసు నుంచి ఆమెను తప్పించింది.
ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆమెను నిరపరాధిగా నిర్ధారించింది. ఈ కేసు నుంచి తప్పిస్తూ తీర్పు చెప్పింది. 1988 బ్యాచ్ కు చెందిన శ్రీలక్ష్మి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004-09 మధ్య గనుల శాఖ కార్యదర్శిగా పని చేశారు. అప్పుడు ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి గనుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని సీబీఐ ఆరోపించింది. అప్పటి సీఎం వై.ఎస్.రాజశేఖర రెడ్డి సన్నిహితుడిగా పేరొందిన గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఈ గనులకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని సీబై వెల్లడించింది. మైనింగ్ లైసెన్సుల్లో క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించారని తెలిపింది. దీంతో 2011 నవంబర్ 28న శ్రీలక్ష్మిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆమెకు బెయిల్ కూడా రాకపోవడంతో 2012 అక్టోబర్ వరకూ దాదాపు ఏడాది పాటు జైలు జీవితం అనుభవించారు. ఆ తర్వాత బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు.
అయితే.. ఓబుళాపురం మైనింగ్ కేసులో తనను అక్రమంగా ఇరికించారంటూ శ్రీలక్ష్మి కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన అభియోగాలను కొట్టివేయాలని కోరారు. అయితే సీబీఐ ఇందుకు నిరాకరించింది. దీంతో శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఎంపికలతో తన పాత్ర లేదని.. తాను నిర్ణయం తీసుకునే నాటికే అది అమల్లో ఉందని తెలిపింది. అయితే శ్రీలక్ష్మి పాత్ర ఉందని సీబీఐ వాదిస్తూ వచ్చింది. ఇరువైపులా వాదనలను ఏళ్ల తరబడి విన్న న్యాయస్థానం చివరకూ శ్రీలక్ష్మి పాత్రపై అభియోగాలు సరికాదని నిర్ధారించింది. నిర్దోషిగా తీర్పు చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ విభజన జరగడంతో శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్ గా పరిగణించారు. అయితే ఏపీలో 2019లో వై.ఎస్.జగన్ అధికారంలోకి వచ్చాక శ్రీలక్ష్మిని ఆంధ్రప్రదేశ్ కు కేటాయించాలంటూ అభ్యర్థించారు. దీనికి కేంద్రం సమ్మతించడంతో ఏపీ కేడర్ కు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఆమె పురపాలక శాఖ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇప్పుడు హైకోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వడంతో త్వరలోనే ఏపీ చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశాలున్నాయి.













