ఇది ఊహించని మహానాడు : చంద్రబాబు నాయుడు

తెలుగు జాతికి మహానాడు పండుగ రోజు అని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. తెలుగు జాతి అంటే ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని, తెలుగు వారి ఆత్మ గౌరవం నినాదంతో ఆయన పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. కరోనా నేపథ్యంలో ఈసారి కూడా టీడీపీ మహానాడును ‘వర్చువల్’ విధానంలో నిర్వహించారు. మొదటి రోజున టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటం వద్ద ఆ పార్టీ అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. దీని తర్వాత మహానాడును ప్రారంభించారు. ఇది ఊహించని మహానాడు అని, క్రియాశీల నేతలు, కార్యకర్తలను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ మూలన చూసినా తెలుగువారు ఉంటారని, తెలుగుదేశం రాకతో నూతన చరిత్ర ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. సమాజ హితమే టీడీపీ ధ్యేయమని, సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి టీడీపీ శ్రేణులు పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ప్రభుత్వం సరిగా స్పందించడం లేదు : బాబు
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం సరైన విధంగా స్పందించడం లేదని చంద్రబాబు ఆరోపించారు. ఆక్సిజన్ లేక, మందులను బ్లాక్‌లో కొనలేక చాలా మంది చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వంతో కలిసి నడవడానికి తాము సిద్ధమని, అనేక సార్లు ప్రకటించామని, అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని అన్నారు. తాము సూచనలిచ్చినా, ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ప్రజలకు భరోసా కల్పించే స్థాయిలో ప్రభుత్వం లేదని, తిరుపతి రూయా ఘటనలో చనిపోయిన వారి విషయంలో ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని ఆరోపించారు. కోవిడ్ కారణంగా ప్రజలు బాగా చితికిపోయారని, బతుకులు ఛిద్రమయ్యాయని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ఓ బాధ్యతాయుత ప్రతిపక్షంగా తాము ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని, రాజకీయాలు చేయమని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని పతనం చేసే పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా తీసుకొచ్చారని, న్యాయస్థానాల్ని కూడా బెదిరించే పరిస్థితికి వస్తే ప్రజాస్వామ్యం ఏమవుతుందనని సూటిగా ప్రశ్నించారు.