నమ్మలేకపోతున్నాం.. ఏదో జరిగింది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలవడానికి ఆయన నివాసానికి వచ్చిన మహిళలు కొందరు బోరున విలపించారు. సార్ మీరు ఇంత చాకిరీ చేశారు. రాత్రిపగలు లేకుండా కష్టపడ్డారు. ఎన్నికల్లో ఇలాంటి ఫలితమా? నమ్మలేకపోతున్నాం. ఏదో జరిగిందని అనిపిస్తోంది. మిమ్మల్ని తలుచుకొంటే మాకు దుఖం ఆగడం లేదు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని వడ్లమూడి, తుళ్ళూరు, విజయవాడ నగరం, జగ్గయ్య పేట తదితర ప్రాంతాల నుంచి ఈ మహిళలు వచ్చారు. ఫలితాలు వచ్చిన రోజు మాలో చాలా మందికి అన్నం తినబుద్ది కాలేదు. అయినా మేం పార్టీతోనే ఉంటాం అని వారు చెప్పారు. వారిని చంద్రబాబు సముదాయించారు. మన పనిని మనం చిత్తశుద్ధితో చేశాం. ఎంత శక్తి ఉంటే అంత శక్తినీ ప్రజలకు మేలు చేయడానికే వెచ్చించాం. ఇది ధైర్యంగా ఉండాల్సిన సమయం. మంచి రోజులు వస్తాయి అని భరోసా ఇచ్చారు.













