ZPTC Elections: జడ్పీటీసీ ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయం
వైఎస్సార్ కడప (YSR Kadapa) జిల్లాలోని పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట (Vontimitta) జడ్పీటీసీ ఉపఎన్నికలు (ZPTC by elections) రాజకీయ రణరంగంగా మారాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (TDP) చరిత్ర సృష్టించింది. దశాబ్దాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) కంచుకోటగా ఉన్న పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని తొలిసారిగా టీడీపీ గెలుచుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఒంటిమిట్టలోనూ టీడీపీ విజయం సాధించడంతో, ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారాయి. అయితే, ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగలేదని, టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
2022లో పులివెందుల జడ్పీటీసీ సభ్యుడు తుమ్మల మహేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తూ మృతిచెందారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఒంటిమిట్ట జడ్పీటీసీగా గెలిచిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం జూలై 30న నోటిఫికేషన్ జారీ చేసి, ఆగస్టు 12న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు నిర్వహించింది.
పులివెందులలో టీడీపీ నుంచి మారెడ్డి లతా రెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి శివ కళ్యాణ్ రెడ్డితో సహా 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఒంటిమిట్టలో టీడీపీ నుంచి అడ్డలూరు ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో దిగారు. ఈ ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. పులివెందుల, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో వైసీపీ ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ముమ్మరంగా ప్రచారం చేసింది. టీడీపీ కూడా కూటమి శక్తిని ఉపయోగించి విస్తృత ప్రచారం నిర్వహించింది.
ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి గెలుచుకున్నారు. ఇది పులివెందులలో టీడీపీకి తొలి విజయం. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు., ఇది ఆ పార్టీకి పెద్ద దెబ్బ. మొత్తం 7638 ఓట్లు పోల్ కాగా టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డికి 6716 ఓట్లు, వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డికి 683 ఓట్లు వచ్చాయి. ఇతరులు 239 ఓట్లు దక్కించుకున్నారు. టిడిపి అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి 6033 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఒంటిమిట్టలోనూ టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12780 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డికి 6513 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ 6267 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
వైసీపీ మాత్రం ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగలేదని ఆరోపించింది. పోలింగ్ బూత్‌ల వద్ద జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ గూండాలు దొంగ ఓట్లు వేశారని, పోలీసులు దీన్ని పట్టించుకోలేదని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వైసీపీ ఏజెంట్లను అనుమతించలేదని, టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. ఈ ఎన్నికలు “పోలీసు vs వైసీపీ” పోరులా మారాయని, ప్రజాస్వామ్యం ఓడిపోయిందని వైసీపీ నేతలు విమర్శించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికలు రద్దు చేసి, కేంద్ర బలగాల సమక్షంలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఎన్నికల సంఘం ఈ ఆరోపణలపై స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
పులివెందులలో టీడీపీ విజయం వైసీపీకి గట్టి ఎదురుదెబ్బగా నిలిచింది. జగన్ సొంత నియోజకవర్గంలో ఈ ఓటమి వైసీపీ నీరసించడానికి సంకేతంగా టీడీపీ నేతలు చెబుతున్నారు. బ్యాలెట్ బాక్సుల్లో “తొలిసారి ఓటేసిన” స్లిప్పులు కనిపించడం టీడీపీ వాదనకు బలం చేకూర్చింది. అయితే, వైసీపీ ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, టీడీపీ అధికార బలంతో గెలిచిందని ఆరోపిస్తోంది. మొత్తానికి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టంగా నిలిచాయి. టీడీపీ విజయం ఒకవైపు చరిత్ర సృష్టించగా, వైసీపీ ఓటమి ఆ పార్టీకి పెద్ద దెబ్బగా మారింది.







