తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్… ఎవరి ఖాతాలో పడుతుందో?
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. అనంతపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీల్లో తప్ప మిగిలిన అన్ని పురపాలికలూ వైసీపీ ఖాతాలో పడ్డాయి. మైదుకూరు కూడా ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో తమ ఖాతాలో వేసుకోబోతోంది వైసీపీ. కానీ తాడిపత్రి సీన్ మాత్రం వేరేలా ఉంది. ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులు కలిసినా సీటు దక్కే పరిస్థితి వైసీపీకి లేదు. మరి ఇక్కడ ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.
తాడిపత్రి మున్సిపాలిటీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి కంచుకోట. కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన జేసీ దివాకర్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీ తరపున ఎంపీ, ఎమ్మెల్యేగా ఎన్నికైన జేసీ కుటుంబీకులు గత ఎన్నికల్లో మాత్రం పరాజయం పాలయ్యారు. దీంతో వారి కంచుకోట బద్దలైంది. అంతేకాక.. జేసీ సోదరుడు ప్రభాకర్ రెడ్డిపై అనేక కేసులు నమోదయ్యాయి. దీంతో వైసీపీపై పోరు మరింత ఉధృతం చేసింది జేసీ ఫ్యామిలీ. అధికార పార్టీని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో పురపాలక ఎన్నికల్లో తలపడింది.
తాడిపత్రిని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో జేసీ ప్రభాకర్ రెడ్డే స్వయంగా కార్పొరేటర్ గా పోటీ చేశారు. తాను పోటీ చేయడం వల్ల టీడీపీ అభ్యర్థులకు మరింత ఆత్మస్థైర్యం వస్తుందనేది ఆయన వ్యూహం. అందుకే ఆరోగ్యం సహకరించకపోయినా రంగంలోకి దిగి నెగ్గారు. తాడిపత్రిలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. ఇందులో 2 వార్డులు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. 34 వార్డులకు ఎన్నికలు జరగ్గా 18 వార్డులు టీడీపీకి దక్కాయి. ఒకటి సీపీఐకి దక్కగా ఇంకోటి ఇండిపెండెంట్ ఖాతాలో పడ్డాయి. ఏకగ్రీవాలతో కలుపుకుని మిగిలిన 14 వార్డులు వైసీపీ సాధించుకుంది.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న జేసీ కుటుంబం తమ పార్టీ వారందరినీ క్యాంప్ కు తరలించింది. అంతేకాదు.. సీపీఐ అభ్యర్థిని, స్వతంత్ర్య అభ్యర్థిని కూడా తమ క్యాంప్ కు తీసుకెళ్లారు. వీళ్లతో కలుపుకుంటే టీడీపీ బలం 20కి చేరింది. మరోవైపు వైసీపీ తరపున ఓటేసేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓట్లు నమోదు చేసుకున్నారు. దీంతో వైసీపీ బలం 16కు చేరుకుంది. అయితే వైసీపీ దౌర్జన్యాలు చేసి తమ అభ్యర్థులను లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని జేసీ ఫ్యామిలీ ఆరోపిస్తోంది. స్థానిక టీడీపీ నేత వలీ వర్గానికి చెందిన నలుగురు కౌన్సెలర్లుగా ఎన్నికయ్యారు. వలీ కుటుంబంపై వైసీపీ ఒత్తిడి చేస్తోందని జేసీ ఫ్యామిలీ ఆరోపిస్తోంది. మరి ఈ ఉత్కంఠపోరులో ఎవరు విజయం సాధిస్తారనేది వేచి చూడాలి.













