Bala Krishna: హిందూపురంలో తన సత్తా చాటుకున్న బాలయ్య..
హిందూపురం (Hindupur) రాజకీయాల్లో తాజాగా జరిగిన పరిణామం టీడీపీ (TDP) వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ (Bala Krishna) మరోసారి తన రాజకీయ చాణక్యత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రతీకారం తీర్చుకున్నారు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ (YCP) హిందూపురం మున్సిపాలిటీలో గెలుపొందడం టీడీపీకి, ప్రత్యేకంగా బాలకృష్ణకు పెద్ద ఎదురు దెబ్బగా మారింది. ఎన్టీఆర్ కాలం నుంచి టీడీపీ అధిపత్యం కొనసాగుతున్న హిందూపురంలో తొలిసారి మరో పార్టీ జెండా ఎగరడం సంచలనంగా మారింది. అయితే ఆ సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెట్టి టీడీపీని పూర్తిగా చిత్తుచేసేలా వ్యూహాన్ని అమలు చేసింది.
ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం ఆరుగురు కౌన్సిలర్లను మాత్రమే గెలిపించుకోగలిగింది, అలాగే ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు విజయం సాధించారు. మిగతా 30 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే గెలిచారు. బాలయ్య ఎంతగా కృషి చేసినా, అధికార పార్టీ వ్యూహానికి ఎదుర్కో లేకపోయారు. ఈ పరాభవాన్ని ఆయన వ్యక్తిగతంగా కూడా తీసుకుని, మున్ముందు హిందూపురంలో పార్టీని తిరిగి బలపడేలా చేయాలని సంకల్పించారు. ఆ సంకల్పానికి ఫలితం నిన్నటి మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికల్లో కనిపించింది. టీడీపీ మున్సిపాలిటీని తిరిగి తన ఆధీనంలోకి తీసుకురావడం ద్వారా బాలకృష్ణ తన రాజకీయ నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. తన అనుచరుడిని మున్సిపల్ చైర్మన్ గా గెలిపించుకునేందుకు బాలయ్య ప్రత్యేక శ్రద్ధ వహించారు. అసెంబ్లీ ఎన్నికల వేళలో కూడా ఈ ఉప ఎన్నికకు ప్రాధాన్యం ఇచ్చారు. తన అనేక కార్యక్రమాలను రద్దు చేసుకుని పూర్తిగా ఎన్నికలపై దృష్టిపెట్టారు.
వైసీపీకి మెజారిటీ ఉన్నప్పటికీ, టీడీపీ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని గెలుచుకోవడం అత్యంత ప్రతిష్టాత్మక విజయంగా మారింది. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఉత్సాహంతో ముందుకు వెళ్లేలా చేశాడు. గతంలో తనను నిరుత్సాహపరిచిన రాజకీయ పరిస్థితులను తిరగరాసేలా పనిచేశారు. హిందూపురం టీడీపీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటివరకు ఆ నియోజకవర్గాన్ని టీడీపీ గట్టిగా పట్టుకుంది. బాలకృష్ణ కూడా 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అయితే, ఆయన గెలుపును అంత విశేషంగా పరిగణించాల్సిన అవసరం లేదని, హిందూపురంలో పార్టీ పట్టు ఉండటమే గెలుపునకు కారణమని ప్రత్యర్థులు విమర్శించారు. కానీ, తాజా మున్సిపల్ ఎన్నికల్లో విజయం టీడీపీకి బూస్ట్ ఇచ్చింది. మున్సిపాలిటీని సాధించుకోవడంతో పాటు హిందూపురంలో పార్టీ పునరుద్ధరణకు మార్గం వేసినట్టైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇది కీలకమైన పరిణామంగా మారింది.













