అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం : చంద్రబాబు
కేంద్రంలో మళ్లీ తృతీయ కూటమి ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 1996 నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయని అంచనా వేశారు. బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 1996 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ ప్రాంతీయ పార్టీల కూటమితో ఏర్పాటైన యునైటెడ్ ఫ్రంట్ నుంచి ప్రస్తుతం జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవెగౌడ ప్రధానమంత్రి అయ్యారు. అప్పట్లో యునైటెడ్ ఫ్రంట్‌కు జాతీయ కన్వీనర్‌గా వ్యవహరించిన చంద్రబాబు దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలను ఒక తాటిపైకి తేవడానికి కృషి చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తృతీయ ఫ్రంట్‌కు కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుందని, కూటమిలో ఉన్న పార్టీలు సాధించిన సీట్లను బట్టి ప్రధాని అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీలో ఈ నెల 11న జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో నానాటికీ వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి బీజేపీ 200 సీట్లు దాటడం కూడా కష్టమేనని అభిప్రాయపడ్డారు.













