ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడ్డ ఉత్తర భారతీయుల సంఘం సమ్మేళనంలో ముఖ్యమంత్రి
గత ఐదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. వీటిలో ఉద్యోగ కల్పన హామీ అమలు మరీ దారుణంగా ఉందని విమర్శించారు. రైతన్నల సమస్యలు పరిష్కారం కాలేదని, వారిని పట్టించుకొనేవారే కరవయ్యారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడ్డ ఉత్తర భారతీయుల సంఘం సమ్మేళనంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఏపీలో అనేక విధాలుగా సమస్యలు సృష్టిస్తోంది. విమర్శించిన వారిని సీబీఐ, ఐటీ, ఈడీతో దాడులు చేయిస్తోంది. దిల్లీలో కేజ్రీవాల్‌ను, ఇక్కడ నన్ను అనేక ఇబ్బందులకు గురిచేసింది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కర్ణాటకలో ఇప్పుడు కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. జేడీఎస్, కాంగ్రెస్ మంత్రులే లక్ష్యంగా దాడులు సాగుతున్నాయి’’ అని విమర్శించారు.
పత్రికా స్వేచ్ఛ పూర్తిగా లేదు
‘‘ఒక రకంగా నాయకత్వం అనేది దేశానికి బహుమతి అవ్వాలి. కానీ ఇప్పుడు దేశం అభద్రతా భావంలో ఉంది. సమస్యలపై మీడియా కూడా సక్రమంగా రిపోర్ట్ చేయట్లేదు. పత్రికా స్వేచ్ఛ అనేది పూర్తిగా లేదు. ఇటీవల కూడా ఈసీపై ఒత్తిడి తెచ్చి ఏపీలోని ముగ్గురు ఉన్నతాధికారులను బదిలీ చేయించారు. వీరిపై ఫిర్యాదు వెళ్లగానే కనీసం విచారణ లేకుండా ఈసీ బదిలీ చేసింది. అదే మేం ఇతరులపై ఫిర్యాదు చేసినప్పుడు ఏ చర్యలూ తీసుకోలేదు. గత 40 ఏళ్లుగా నేను సాంకేతికతను ప్రోత్సహిస్తున్నా. ఒక్కోసారి అదే మనకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఈవీఎంల విషయంలోనూ అవకతవకలు జరుగుతున్నాయి. అందుకే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ఇది సాధ్యం కానప్పుడు కనీసం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరుతున్నాం. ఈ అంశంపై దేశంలో 22 పార్టీలతో కలిసి మేం ఈసీని కలిశాం. అయినా ఎలాంటి స్పందనా లేదు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. కేంద్ర పెద్దలు దిల్లీ నుంచి నేరుగా మాపై దాడి చేస్తున్నారు. వీటి నుంచి ఎదుర్కొనేందుకు మేం చాలా కష్టపడాల్సి వస్తోంది. మీ మద్దతు సహా ఆశీస్సులు కావాలి’’ అని చంద్రబాబు కోరారు.













