AP Politics: ఒక సమయంలో చక్రం తిప్పిన నేతలు..ఇప్పుడు ఏమైపోయారు..

రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు చురుకుగా కనిపించిన కొంతమంది నేతలు ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోయారు. ముఖ్యంగా ఒకప్పుడు సత్తా చాటిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్ (Dokka Manikya Varaprasad), మేకతోటి సుచరిత (Mekathoti Sucharitha), రావెల కిషోర్ బాబు (Ravela Kishore Babu) లాంటి నేతలు ఇప్పుడు చాలా వరకు సైలెంట్ అవుతున్నారు.
డొక్కా మాణిక్య వరప్రసాద్ గతంలో గుంటూరు (Guntur) జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీ (Congress) హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో టిడిపి (TDP) లో చేరే యోచనలో ఉండగా అకస్మాత్తుగా వైసిపి (YSRCP) లోకి వెళ్లారు. అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ, మంత్రిగా మారాలన్న ఆశ నెరవేరలేదు. పైగా తనకు అనుకున్న నియోజకవర్గం ఇవ్వకపోవడంతో టిడిపిలోకి మళ్లీ ప్రవేశించారు. అయితే అక్కడ కూడా ఆశించిన గుర్తింపు లేకపోవడంతో ప్రస్తుతం రాజకీయంగా పక్కదారి పట్టినట్టే అయిపోయారు.
మరోవైపు మేకతోటి సుచరిత, వైసిపిలో హోం మంత్రిగా పనిచేశారు. మొదట్లో మంచి ఉత్సాహంతో పనిచేసినా, మంత్రివర్గ మార్పుల సమయంలో పదవి పోవడంతో ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. తాడికొండ (Tadikonda) నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ, పూర్తి ఉత్సాహంతో వ్యవహరించకపోవడం ఓటమికి కారణమైందని పలువురు చెబుతున్నారు. ఇప్పటివరకు పార్టీ సభలు, కార్యక్రమాల్లో ఆమె కనిపించడం లేదు. తాజా సమావేశానికి కూడా గైర్హాజరు కావడం ఇది స్పష్టంగా చాటుతోంది. రావెల కిషోర్ బాబు విషయానికి వస్తే, మొదట టిడిపిలో విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. అయితే, కుటుంబ విషయాల్లో చోటుచేసుకున్న కొన్ని వివాదాలు ఆయనను టిడిపి నుంచి దూరం చేశాయి. ఆపై బిజెపి (BJP), జనసేన (Janasena) పార్టీల్లో కొంతకాలం ఉన్నా, అక్కడ కూడా స్థిరత్వం చూపలేకపోయారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా స్పష్టత లేని పరిస్థితిలో ఉండటం ఆయన రాజకీయ జీవితం సంక్షోభంలో ఉందనిపిస్తోంది.
ఈ ముగ్గురు నేతలు ఒకప్పుడు ప్రజలతో మమేకమై ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రజల్లోనూ, పార్టీల్లోనూ వీరి పేరు పెద్దగా వినిపించడం లేదు. తీసుకున్న నిర్ణయాలు, మారిన వైఖరులు వీరిని నెమ్మదిగా వీరి రాజకీయ జీవితం నుంచి దూరం చేశాయి అని స్పష్టమవుతోంది. ఒక్కోసారి స్థిరత్వం లేకపోవడం రాజకీయ జీవితం పై ఎలాంటి ప్రభావం చూపుతుందు అన్న విషయంకు వీరి జీవితం తార్కాణంగా మారింది.