హాట్ సీటుగా మారిన అనకాపల్లి..! దక్కేదెవరికో..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజురోజుకూ ఆసక్తి కలిగిస్తోంది. వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన ఇప్పటికే కలిసి పోటీ చేస్తున్నట్టు ప్రకటించాయి. త్వరలోనే ఈ కూటమిలో బీజేపీ కూడా జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఎలా ఉంటాయి.. ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయనేది ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికే పలు స్థానాల్లో పార్టీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఫలానా నియోజకవర్గం సీటు తమకే కావాలని పార్టీలు పట్టుబడుతున్నాయి. దీంతో ఆయా పార్టీల అధినేతలకు తలనొప్పిగా మారింది. ఇలాంటి వాటిలో అనకాపల్లి పార్లమెంటు స్థానం మొదటి వరసలో ఉంది.
అనకాపల్లి పార్లమెంటు స్థానం కోసం టీడీపీ, జనసేన గట్టిగా పోటీ పడుతున్నాయి. ఈ సీటు తమకే కావాలంటూ రెండు పార్టీల నేతలూ కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ యువనేత చింతకాయల విజయ్ ఇక్కడి నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. నర్సీపట్నం అసెంబ్లీ నుంచి తండ్రి అయ్యన్నపాత్రుడు పోటీ చేయడం ఖాయం. ఈ నేపథ్యంలో అనకాపల్లి సీటుపై విజయ్ కన్నేశారు. ఇతనికి లోకేశ్ మద్దతు ఉన్నట్టు సమాచారం. అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ ఐ-టీడీపీని విజయ్ సమర్థవంతంగా నడిపిస్తున్నారు. పలు కేసులు కూడా ఆయనపై నమోదయ్యాయి. దీంతో విజయ్ ఈ సీటు తనకు తప్పకుండా దక్కుతుందని ఆయన భావిస్తున్నారు.
అయితే అనకాపల్లి సీటు తమకే కావాలని జనసేన కూడా గట్టిగా కోరుకుంటోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాను అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని యలమంచిలిలో నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నట్టు నాగబాబు ఇటీవల ప్రకటించారు. దీంతో ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేయడం ఖాయమని భావిస్తున్నారు. నాగబాబు అనకాపల్లి కేంద్రంగా పలు సమావేశాలు నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నారు. కచ్చితంగా తనకు సీటు దక్కుతుందనే ఉద్దేశంతోనే నాగబాబు విస్తృతంగా పర్యటిస్తున్నట్టు జనసైనికులు చెప్పుకుంటున్నారు.
అయితే జనసేనలోనే మరో నేత కొణతాల రామకృష్ణ కూడా ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఇంకా చెప్పాలంటే అనకాపల్లి సీటు కోసమే ఆయన జనసేన పార్టీలో చేరారు. నాగబాబు అక్కడ తిష్ట వేయక ముందు వరకూ కొణతాల రామకృష్ణ యాక్టివ్ గానే కనిపించారు. అయితే నాగబాబు అక్కడ హడావుడి చేయడం మొదలు పెట్టాక కొణతాల రామకృష్ణ సైలెంట్ అయిపోయారు. నాగబాబు సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. మరి ఈ విషయంలో పవన్ కల్యాణ్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి కలిగిస్తోంది. అన్నిటికీ మించి ఈ సీటు ఎవరికి దక్కుతుందో తెలిసిన తర్వాతే అభ్యర్థిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.













