Bhuma Akhila Priya: భూమా అఖిల ప్రియ లేక ఏవీ సుబ్బారెడ్డి..టీడీపీ మద్దతు ఎవరికీ?
తెలుగుదేశం పార్టీలో (Telugu Desam party) ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు కీలక నేతలు ఒకరిపై ఒకరు రాజకీయంగా తమదే పైచేయి అని చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు (Kurnool) చెందిన ఏవీ సుబ్బారెడ్డి(A.V.Subba Reddy) , మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ (Bhuma Akhila Priya) మధ్య మొదట మంచి అనుబంధమే ఉన్నప్పటికీ, కాలక్రమేణా వారి మధ్య రాజకీయ విభేదాలు తీవ్రంగా మారాయి.
ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా, నిత్యం మీడియా ముఖంగా వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ, తమ ఆధిపత్యం చూపించుకునే ప్రయత్నంలో ఉంటున్నారు. ఈ విభేదాలు వ్యక్తిగత స్థాయిని దాటి రాజకీయ స్థాయికి చేరాయి. ముఖ్యంగా సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసు సమయంలో అఖిల ప్రియ పేరు చర్చకు రావడం ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళింది.
ఇటీవల ఈ రాజకీయ పోరు మరింత తీవ్రమైంది. సుబ్బారెడ్డికి ఆళ్లగడ్డలో ఉన్న సొంత ఇంటిపై అఖిల ప్రియ కన్నేశారు. ఆ ఇంటిని కూలగొట్టాలని ఆమె రాజకీయంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రోడ్డు ఆక్రమణ అంటూ ఆరోపణలు వచ్చినా, సంబంధిత అధికారుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఈ క్రమంలో, సుబ్బారెడ్డి నియోజకవర్గంలో ఉండకుండా చూడాలనే ఉద్దేశంతో అఖిల ప్రియ నడుం బిగించినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అఖిల ప్రియ తరచూ నిరసనలు, ధర్నాలతో రాజకీయ వేడి పెంచుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు సుబ్బారెడ్డి ప్రయత్నించారని ఆమె అనుకుంటుండటంతోనే ఇద్దరి మధ్య చిచ్చు మరింత పెరిగినట్లు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇంతటి ఉద్రిక్తతల మధ్య తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం ఈ వివాదంపై మౌనం పాటిస్తోంది. కానీ, లోపల మాత్రం ఏవీ సుబ్బారెడ్డికి మద్దతుగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సుబ్బారెడ్డి పార్టీకి కీలక నేతగా ఉండటమే కాకుండా, పొలిట్ బ్యూరో సభ్యుడితో మంచి అనుబంధం కలిగి ఉండటం, ముఖ్యంగా సీఎం చంద్రబాబుతో ఆయనకు సత్సంబంధాలు ఉండటం కూడా ఆయనకు అనుకూలంగా మారింది. ఈ పరిణామాల కారణంగా అధిష్టానం ప్రస్తుతానికి సుబ్బారెడ్డి వైపే మొగ్గు చూపుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అఖిల ప్రియ మాత్రం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ రాజకీయ పోరు ఇంకా ఎంతవరకు వెళ్లబోతుందో వేచి చూడాలి.













