ఒక్క ఛాన్స్ ఇచ్చి.. మా పిల్లల్ని జైలు పాలు చేసుకోవాలా?
తన కుమారుడికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని వైఎస్ విజయలక్ష్మి కోరుతున్నారని.. ఒక్క ఛాన్స్ ఇచ్చి మా పిల్లల్ని జైలు పాలు చేసుకోవాలా? అంటూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విరుచుకపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ కుటుంబ మొత్తం తేడానే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని వలస పక్షులను పులికాట్ సరస్సు వద్ద చూస్తుంటాం. నిర్ణీతమైన సమయంలోనే అవి బయటకు వచ్చి, వెళ్లిపోతుంటాయి. ఇప్పుడు వైఎస్ కుటుంబ సభ్యులు కూడా అలాగే ఉన్నారు. మామూలుగా కుటుంబంలో ఒకరో ఇద్దరో తేడా అనుకున్నాం.
కానీ కుటుంబం మొత్తం మానసిక పరమైన తేడాను ఎదుర్కొంటున్నారు. మొన్న షర్మిల వచ్చి ఏదో మాట్లాడారు. నిన్న తల్లి విజయలక్ష్మి గారిని దింపారు. నా కొడుక్కి ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెబుతున్నారు. ఎందుకు తల్లి మీ కొడుక్కి ఒక ఛాన్స్ ఇచ్చి మా పిల్లలందరినీ రోడ్లపైకి ఈడ్చడానికా? లేదంటే జైలు పాలు చేయడానికా? ఈ రాష్ట్రంలో కరువు కోరల్లో చిక్కి.. అవినీతి తాండవం చేయాలనా? ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు? అని ఆ రాష్ట్ర ప్రజలంతా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అంటూ యామిని ఆగ్రహం వ్యక్తం చేశారు.













