బాబు వెంట్రక పీకలేవు నానిపై దివ్యవాణి తీవ్రవ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పరిధులు దాటుతోంది. గత కొంత కాలంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పలువురు తేదేపా నేతల్ని పరుష పదజాలంతో తిట్టిపోస్తున్న మంత్రి కొడాలి నానిపై తెలుగుదేశం పార్టీ కూడా అదే స్థాయిలో ప్రతిదాడికి సిద్ధమైంది. ఈ బాధ్యతను సినీనటి, తెలుగుదేశం నేత, వాగ్భాణాలు సంధించడంలో స్వల్పకాలంలోనే పేరొందిన దివ్యవాణికి అప్పగించినట్టు కనిపిస్తోంది. అందుకు నిదర్శనంగా శనివారం కొడాలి నానిపై టీడీపీ నాయకురాలు దివ్యవాణి తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. కొడాని నాని మాటతీరు, పనితీరుతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.మంత్రి స్థాయిలో ఉండి లారీలతో గుద్దిస్తామని వ్యాఖ్యానించడం దారుణమని అన్నారు. కొడాలి నానిని చూస్తే రౌడీ ముదిరి రాజకీయ నాయకుడయినట్టు ఉంటుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది చంద్రమండల స్థాయి అని… ఆయనను విమర్శించే స్థాయి కొడాలి నానికి లేదన్నారు. ఖర్జూరనాయుడి ఫ్యాక్షనిజం వల్లో, రౌడీయిజం వల్లో చంద్రబాబు సీఎం కాలేదన్నారు.ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారంటూ చంద్రబాబును విమర్శిస్తున్న నాని, ఆరోజు జరిగిన పరిణామాలకు స్క్రిప్ట్ రాశాడా? ఎన్టీఆర్ కు స్టెరాయిడ్స్ ఎవరిచ్చారో, సూట్ కేసులు ఎవరు తరలించారో నానికి తెలియదా? అని ప్రశ్నించారు. నానిలాంటి వాళ్లు ఎన్ని వ్యాఖ్యలు చేసినా చంద్రబాబు తెల్లవెంట్రుకల్లో ఒకటి కూడా కదలదని స్పష్టం చేశారు. మొరటోడికి మొగలిపువ్వు ఇస్తే ఎక్కడో పెట్టుకున్నట్టు… మంత్రి పదవి వస్తే ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. మొత్తం మీద దివ్యవాణి రంగంలోకి దిగడంతో ఏపీలో పార్టీల మధ్య యుద్ధం ముదిరి పాకాన పడినట్టు కనిపిస్తోంది.













